Site icon NTV Telugu

TDP – Janasena Meeting: టీడీపీ-జనసేన జేఏసీ కీలక తీర్మానం.

Jac

Jac

TDP – Janasena Meeting: టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం ముగిసింది.. ఇక నుంచి ప్రతి 15 రోజులకోసారి జేఏసీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.. వచ్చే జేఏసీ సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ నెల 14, 15, 16 తేదీల్లో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ఉంటాయని.. ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే ఖరారు చేస్తాం.. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపై రెండు పార్టీల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేస్తామని.. ఈ నెల 13వ తేదీన ఉమ్మడి మేనిఫెస్టో కమిటీ భేటీ కానుందని చెబుతున్నారు.. ఇక, టీడీపీ – జనసేన జేఏసీ సమావేశంలో కరవు, రైతుల ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.. ఏపీలోని కరవు పరిస్థితులపై జేఏసీ సమావేశంలో తీర్మానం చేశారు..

కరవు పరిస్థితులు కళ్ల ముందు కనిపిస్తున్నా దేవుడి దయతో అంతా బాగుందని రాష్ట్ర పాలకుడు చెప్పడం పచ్చి అబద్ధమే. ఖరీఫ్ సమయంలో 32.42 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోవడమనేది వాస్తవం. 25 లక్షల ఎకరాలలో సాగు కూడా చేయలేదు. ప్రకృతి వైపరీత్యం వల్ల నెలకొన్న కరవుతోపాటు పాలకపక్షం నిర్లక్ష్య ధోరణులతోనూ రైతాంగం నష్టపోయిందని తీర్మానంలో పేర్కొంది టీడీపీ-జనసేన జేఏసీ.. సకాలంలో సాగు నీరు కూడా ఇవ్వకపోవడంతో పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతంలో పంటలు దెబ్బ తిన్నాయి. సాగు నీటి విడుదలలో, కాలువల నిర్వహణలో అధికార యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉంది. ఈ దుర్భర పరిస్థితుల్లో కరవు మండలాలు గుర్తించి ప్రకటించాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. నిబంధనల మేరకు కరవును లెక్కిస్తే 449 మండలాలను ప్రకటించాల్సి ఉంది. కేవలం 103 మండలాలనే కరవు మండలాలుగా గుర్తించడం రైతులను మోసగించడమే అని దుయ్యబట్టారు.

ఇక, వర్షాభావం మూలంగాను, సాగు నీరు అందకపోవడం వల్ల పంటలు కోల్పోయిన అన్ని మండలాలను కరవు ప్రాంతాలుగా గుర్తించాలని డిమాండ్‌ చేసింది టీడీపీ – జనసేన జేఏసీ సమావేశం.. రాష్ట్రవ్యాప్తంగా నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో పంట నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని.. ఇన్స్యూరెన్స్ మీద ఉన్న అయోమయాన్ని తొలగించాలని.. ఇన్స్యూరెన్స్‌ను తక్షణమే చెల్లించేలా విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.. జనసేన, తెలుగుదేశం రైతాంగానికి అండ నిలుస్తాయి. కరవు మండలాల్లో పర్యటించి రైతులకు అందాల్సిన సాయం సక్రమంగా చేరేలా పోరాడుతామని టీడీపీ – జనసేన ఉమ్మడి సమావేశం ప్రకటించింది.

Exit mobile version