NTV Telugu Site icon

Death mystery: మిస్ అయింది ఒక రాష్ట్రంలో.. డెడ్‌బాడీ దొరికింది మరో రాష్ట్రంలో.. అసలేమైంది?

Death

Death

ఆమె ఒక బీజేపీ నాయకురాలు.. అనుమానాస్పద స్థితిలో మరణించింది. దాదాపు తొమ్మిది నెలలైంది. కానీ ఆమె ఎలా చనిపోయింది. ఎవరైనా చంపారా? కేసు పురోగతి ఏంటి? ఇవేమీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీంతో ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఆమె ఎలా అదృశ్యమైంది? ఎక్కడ చనిపోయింది. అసలేం జరిగిందో.. ఇదంతా తెలియాలంటే ఈ వార్త చదవండి.

మమతా యాదవ్.. మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు. అనుమానాస్పద స్థితిలో మరణించి తొమ్మిది నెలలైంది. టాటూ వేయబడిన మమతా యాదవ్ మృతదేహం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో లభ్యమైంది. కానీ మమతా యాదవ్ మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఇంకా పోలీసులు అప్పగించలేదు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లభించలేదు. రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగాల మధ్య దర్యాప్తు చిక్కుకుంది. మమతను హిందూ సంప్రదాయాల ప్రకారం దహనం చేయాలనుకుంటున్నామని పోలీసులు తెలిపినా అందుకు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఆమెను గౌరవప్రదంగా నిర్వహించాలనుకుంటున్నామని ఆమె తల్లి రైనా బాయి చెప్పింది.

మమతా యాదవ్ సెప్టెంబర్ 11, 2023న కనిపించకుండా పోయింది . పరిచయస్తుడి నుంచి రూ. 7 లక్షలు రికవరీ చేయడానికి తాను ప్రయాగ్‌రాజ్‌కి వెళ్తున్నట్లు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లింది. ఆమె చివరిసారిగా సెప్టెంబర్ 21న తన సోదరుడితో మాట్లాడింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు పదే పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. దర్యాప్తు కూడా సరిగ్గా చేయలేదని వాపోయారు.

ఇక ఫిబ్రవరిలో మమత సోదరుడు రాజ్‌భాన్‌ను పోలీసులు ప్రయాగ్‌రాజ్‌కి పిలిచారు. మృతదేహాన్ని సెప్టెంబర్ 26, 2023న మమత మృతదేహంగా సోదరుడు గుర్తించిన తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో పోలీసులు పాతిపెట్టారు.

ఇదిలా ఉంటే తన ప్రాణాలకు ముప్పు ఉందని ముందే మమత చెప్పిందని సోదరుడు రాజ్‌ఖాన్ తెలిపారు. తన సోదరి ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను గుర్తుచేసుకున్నారు. పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయాడు. పోలీసులు ఏ మాత్రం సహకరించలేదన్నాడు. తన సోదరి దగ్గర రాజకీయ నాయకుల కీలక సమాచారం పెన్‌డ్రైవ్‌లో ఉందని చెప్పుకొచ్చాడు. ఆ కారణంగానే హత్య జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. రాజకీయ కారణాలతోనే మమత చనిపోయిందని సోదరుడు ఆరోపించాడు.
మమత మృతదేహాన్ని ప్రయాగ్‌రాజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని.. దర్యాప్తు చేయడం వారి బాధ్యత అన్నారు. వారికి అన్ని ఆధారాలను అందజేసినట్లు అశోక్‌నగర్ పోలీసు సూపరింటెండెంట్ వినీత్ జైన్ తెలిపారు.

ఇదిలా ఉంటే బీజేపీ నేత మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఈ కేసును ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లేదా ఎస్‌టిఎఫ్ (స్పెషల్ టాస్క్ ఫోర్స్) స్వాధీనం చేసుకోవాలన్నారు. ఈ మేరకు డిజిపి (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్)కి లేఖ రాశారు. ఇది సామాన్యమైన విషయం కాదని.. బీజేపీ హత్యపై సీబీఐ దర్యా్ప్తు జరగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన కుట్ర సిద్ధాంతాలను బీజేపీ కొట్టిపారేసింది.