NTV Telugu Site icon

Covid Vaccination: దేశంలో 86 శాతం మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. దేశంలో ఇప్పటివరకు 86 శాతం మంది పెద్దలకు రెండు డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ వెల్లడించారు. అలాగే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. 6 నుంచి 12 ఏళ్ల వారికి కొవాగ్జిన్, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్‌, 12 ఏళ్లు పైబడిన వారికి జై కోవ్ డీ వ్యాక్సిన్ రెండో డోస్‌‌కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను దేశంలో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇస్తున్నారు. కార్బెవ్యాక్స్ టీకాను 12 నుంచి 15 ఏళ్ల వారికి ఇస్తున్నారు. తాజాగా ఈ రెండు టీకాలను ఇంకా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. కొవాగ్జిన్ టీకాను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై పరీక్షించి చూసినప్పుడు, పెద్దలతో పోల్చినప్పుడు పిల్లల్లో ఈ టీకా అధిక ప్రభావం చూపించిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించి సంబంధిత సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు అందించినట్లు తెలిపింది. దీంతో కొవాగ్జిన్ టీకా అత్యంత భద్రత కలిగి ఉందని నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ప్రస్తుత అవసరాలకు తగినన్ని టీకా నిల్వలు తమ దగ్గర ఉన్నాయని భారత్ బయోటెక్ వివరించింది.