NTV Telugu Site icon

Sri Krishnarjuna Yuddhamu: ఆరు పదుల ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’

Sam

Sam

Sri Krishnarjuna Yuddhamu: ఈ తరం ప్రేక్షకులు బాలకృష్ణ, చిరంజీవి మధ్య సాగుతున్న బాక్సాఫీస్ వార్ గురించి ముచ్చటించుకుంటూ ‘ఆహా.. పోటీ అంటే ఇది కదా..’ అంటున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే అప్పట్లో ఆల్ రౌండర్ గా సాగుతున్న నటరత్న నందమూరి తారక రామారావు, సాంఘిక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తున్న నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మధ్య మరింత విశేషమైన పోటీ ఉండేది. అభిమానులు వారిద్దరినీ దైవాంశసంభూతులుగా భావిస్తున్న రోజులవి. అలాంటి ఇద్దరూ కలసి నటించిన చిత్రాలు సైతం తెలుగువారిని విశేషంగా అలరించాయి. యన్టీఆర్, ఏయన్నార్ కలసి కేవీ రెడ్డి దర్శకత్వంలో శ్రీకృష్ణార్జునులుగా నటించిన ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’ 1963 జనవరి 9న విడుదలై విజయఢంకా మోగించింది.

శ్రీమద్భాగవతంలో ‘గయోపాఖ్యానము’ ప్రసిద్ధమైనది. అది తెలుగునేలపై నాటకంగానూ బహుళ ప్రచారం పొందింది. ఆ ఇతివృత్తాన్ని తీసుకొని సినిమాకు అనువుగా పింగళి నాగేంద్రరావుతో రచన చేయించారు కేవీ రెడ్డి. ఈ చిత్ర కథ నారాయణుని స్తుతిస్తూ నారదుడు ఆకాశయానం చేస్తూ కనిపించడంతో మొదలవుతుంది. గంధర్వ రాజయిన గయుడు బ్రహ్మను వరాలు అర్థించడానికి వెళ్తూంటాడు. జన్మ ఎత్తినందుకు తన పేరు సదా నిలచిపోవాలన్నదే తన కోరిక అని చెప్పి బ్రహ్మలోకం వెళతాడు గయుడు. ఆ పై నారదుడు శ్రీకృష్ణుని దర్శించి, తాను తెచ్చిన పారిజాతపుష్పాన్నిఇస్తాడు. ఆ పుష్పాన్ని శ్రీకృష్ణుడు అక్కడే ఉన్న రుక్మిణికి కానుకగా ఇస్తాడు. అది తెలిసిన సత్యభామ ఆగ్రహిస్తుంది. ఆమెను అనునయిస్తాడు కృష్ణుడు. తమ చెల్లెలు సుభద్రకు వివాహం గురించి బలరామకృష్ణులు చర్చించుకుంటారు. కానీ,సుభద్ర తన మనసు అర్జునునికే అర్పించి ఉంటుంది. అది అన్న శ్రీకృష్ణునికి తెలుసు. అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ మునివేషంలో ద్వారకకు వచ్చేలా చేస్తాడు కృష్ణుడు. సుభద్రను ఆయనకు సపర్యలు చేయ నియమిస్తారు. తరువాత తన బావ అర్జునుడే తనకోసం అలా వచ్చాడని సుభద్రకు తెలుస్తుంది. వారి మధ్య ప్రేమను అంగీకరించి పెద్దలు పెళ్ళి చేస్తారు. శ్రీకృష్ణార్జునులు ఖాండవదహనం చేస్తారు. అప్పుడు అగ్నిదేవుడు సుదర్శన చక్రం కృష్ణునికి, అర్జునుడికి గాండీవాన్ని బహూకరిస్తాడు. తరువాత కృష్ణుడు సూర్యునికి నమస్కరిస్తూ ఆర్ఘ్యం వదలుతూ ఉండగా, ఆకాశయానం చేస్తూ తాంబూల విసర్జనం చేస్తాడు గయుడు. అది కృష్ణుని దోసిట పడుతుంది. దాంతో అందుకు కారకుడైన వాడిని అంతమొందిస్తానని శ్రీకృష్ణుడు అంటాడు. అది తెలిసిన గయుడు వణికి పోతాడు. నారదుడు చూపిన మార్గంలో పాండవుల వద్దకు వెళ్ళి శరణుకోరతాడు గయుడు. అతనిని వధిస్తానన్నవారెవరో తెలియక శరణార్థిని ఆదరిస్తారు పాండవులు. చివరకు తెలిసిన తరువాత శరణార్థికి ఇచ్చిన మాటకే కట్టుబడతారు. అది తెలిసిన కృష్ణుడు కోపగిస్తాడు. చెల్లెలు సుభద్ర వచ్చి గయుని మన్నించమని వేడుకుంటుంది. అందుకు కృష్ణుడు సమ్మతించడు. చివరకు శ్రీకృష్ణార్జున యుద్ధం సంభవిస్తుంది. తొలుత కృష్ణునికి నమస్కరించాకే యుద్ధానికి దిగుతాడు అర్జునుడు. వారి మధ్య సాగుతున్న యుద్ధాన్ని ఆపడానికి శివుడే దిగి వస్తాడు. రాబోయే కురేక్షేత్ర యుద్ధంలో తన బహిప్రాణమైన అర్జునుని వీరపరాక్రమం లోకానికి తెలియజేయడానికే ఇలా చేశానని కృష్ణుడు చెబుతాడు. గయుడు ‘నేనూ నీ భక్తపరమాణువునే కావమని’ శ్రీకృష్ణుని వేడుకుంటాడు. కృష్ణుడు అతని మన్నిస్తాడు. గయుని కారణంగా శ్రీకృష్ణార్జున యుద్ధము సంభవించినదని, ఆతని చరిత్ర జగద్విదతమవుతుందని, ఈ కథ విన్నవారికి భయాలు తొలగుతాయని పరమేశ్వరుడు వరమిస్తాడు. దాంతో గయుడు మహాశివుని కీర్తిస్తూండగా కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో సుభద్రగా బి.సరోజాదేవి, రుక్మిణిగా జూనియర్ శ్రీరంజని, సత్యభామగా యస్.వరలక్ష్మి, నారదునిగా కాంతారావు, బలరామునిగా మిక్కిలినేని, గయునిగా ధూళిపాల, ధర్మరాజుగా గుమ్మడి నటించగా, మిగిలిన పాత్రల్లో అల్లు రామలింగయ్య, మహంకాళి వెంకయ్య, నాగయ్య, ముక్కామల, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, చదలవాడ, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, సురభి బాలసరస్వతి కనిపించారు.

ఈ చిత్రానికి మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు సమకూర్చగా, పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పన చేశారు. ఇందులోని “దేవ దేవ పరంధామ..”, “అలిగితివా సఖీ..”, “అన్నీ మంచి శకునములే..”, “చాలదా ఈ పూజ దేవీ..”, “స్వాముల సేవకు వేళాయె..”, “తఫము ఫలించిన శుభవేళ..”, “మనసు పరిమళించెనే..”, “వేయిశుభములు కలుగు నీకు..” అంటూ సాగే పాటలు విశేషంగా అలరించాయి. ఇక ‘గయోపాఖ్యానం’లోని పద్యాలను, ‘పారిజాతాపహరణం’లోని పద్యాన్ని అనువైన చోట వినియోగించుకున్నారు.

యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ ఆ నాడు మేటి నటులుగా రాణిస్తున్నారు. అందులో ఎవరి పేరు ముందుగా ప్రకటించాలో కేవీ రెడ్డికి సమస్యగా మారింది. దాంతో తారాగణం అన్న కార్డ్ పడగానే యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ శ్రీకృష్ణార్జునులుగా తెరపై కనిపిస్తారు. వారి తరువాత బి.సరోజాదేవిని సైతం తెరపై చూపించాకే మిగిలిన నటవర్గం పేర్లు ప్రకటించారు. టైటిల్స్ నేపథ్యంలో ఘంటసాల గానంచేసిన “దేవ దేవ పరంధామ..” పాట వినిపించడమూ విశేషం! ఈ గీతం శ్రీకృష్ణస్తుతితో రూపొందింది. దీనిని బట్టే ఈ చిత్రంలో అసలు కథానాయకుడు ఎవరో ప్రేక్షకుల ఊహకే వదిలేశారు కేవీ రెడ్డి. పౌరాణికాలకు యన్టీఆర్ పెట్టింది పేరుగా మారడానికి కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘మాయాబజార్’ కారణమని అందరికీ తెలుసు. అందువల్ల తాను మలచిన ప్రతిమకే కేవీ ఎప్పుడూ అగ్రతాంబూలం ఇచ్చేవారు. అలాగే ఈ చిత్రాన్ని నిర్మించిన తన సొంత నిర్మాణ సంస్థ జయంతి పిక్చర్స్ పతాకంపై అంతకు ముందు ఏయన్నార్ తో ‘పెళ్ళినాటి ప్రమాణాలు’ అనే సాంఘికం రూపొందించారు కేవీ. ఇలా ఇద్దరినీ ఒక్కోకోణంలో చూసి, వారికి తగ్గ పాత్రలు ఇచ్చారు కేవీ.

పింగళి వారి రచనా చమత్కారాన్ని గురించి ఎన్నెన్నో కథలు చెప్పుకుంటారు. ఆయన రచనతో రూపొందిన చిత్రాలను ఇప్పుడు పరిశీలించినా, అది నిజమే అనిపిస్తుంది. ఇందులోనూ ఆయన తనదైన మార్కు ప్రదర్శించారు. అర్జునుని దశనామాలు – అర్జునుడు, జిష్ణుడు, బీభత్సుడు, ధనంజయుడు, ఫల్గుణుడు, పార్థుడు, విజయుడు, శ్వేతవాహనుడు, సవ్యసాచి, కిరీటి- ఈ పదాల్లోని మొదటి అక్షరాలను కలిపి, స్వాములవారి వేషంలో ద్వారకకు వచ్చిన అర్జునునికి ‘అజిబీధపఫావిశ్వేసకి’ స్వాముల వారు అని పేరు పెట్టడం పింగళి వారి రచనా చమత్కృతికి నిదర్శనం.

ఈ చిత్రానికి కమల్ ఘోష్ సినిమాటోగ్రాఫర్ అయినా, ట్రిక్స్ ను రవికాంత్ నగాయిచ్ సమకూర్చారు. తరువాతి రోజుల్లో ప్రముఖ దర్శకునిగా రాణించిన సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించి, 13 కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. 1963వ సంవత్సరం యన్టీఆర్ కు “లవకుశ, నర్తనశాల, బందిపోటు” వంటి సూపర్ డూపర్ హిట్స్ నూ అందించింది. వాటికి శ్రీకారంగా ఈ ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’ నిలచింది. తరువాత ‘శ్రీకృష్ణార్జున యుద్ధము’ చిత్రాన్ని కన్నడ, తమిళ భాషల్లో అనువదించారు. ఈ సినిమా విడుదలయ్యాక అనేక కేంద్రాలలో యన్టీఆర్ ను తెరపైచూడగానే అభిమానులు టెంకాయలు కొట్టి, హారతులు ఇచ్చారు. ఎటు చూసినా ఇందులో యన్టీఆర్ అభినయం పైచేయిగా సాగింది. అందువల్ల ఈ సినిమాను చూసిన తరువాత ఏయన్నార్ భార్య అన్నపూర్ణమ్మ ఇకపై ‘పౌరాణికాల్లో యన్టీఆర్ గారితో కలసి నటించకండి..’ అని చెప్పారట. దానిని ఏయన్నార్ పాటించారు. కారణాలు ఏవైనా ఈ సినిమా తరువాత దాదాపు 14 ఏళ్ళు యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించలేదు. మళ్ళీ 1977లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన ‘చాణక్య-చంద్రగుప్త’లో వారిద్దరూ నటించారు. ఆ తరువాత “రామకృష్ణులు, సత్యం-శివం” వంటి చిత్రాల్లోనూ అభినయించారు