Site icon NTV Telugu

Water Contamination : హిమాచల్ ప్రదేశ్‎లో కలుషిత నీరు తాగి 535మందికి అస్వస్థత

Drinking

Drinking

Water Contamination : హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ సబ్ డివిజన్‌లో కలుషిత నీరు తాగి 535మంది అస్వస్థతకు గురయ్యారు. బాన్, జంద్గీ గుజ్రాన్, జందలి రాజ్‌పుతాన్, పన్యాల, పథియాలు, నియతి, రంగస్ చౌకీ హార్, థాయిన్, శంకర్‌తో సహా డజను గ్రామాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 300 దాటిందని రంగస్ పంచాయతీ అధిపతి రాజీవ్ కుమార్ అంతకుముందు రోజు చెప్పారు. కొంతమంది రోగులను హమీర్‌పూర్‌లోని ఆసుపత్రులకు రిఫర్ చేశారు. జలశక్తి శాఖ అందించే కలుషిత నీరు తాగి ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. నీటిలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉండటం వల్లే అనారోగ్యం బారిన పడ్డారని కుమార్ చెప్పారు. నిర్మాణంలో ఉన్న ట్యాంక్‌లో నిల్వ ఉంచిన నీటిని శుద్ధి చేయకుండానే పంపిణీ చేశారని ఆరోపించారు.

Read Also: Taj Mahal : ప్రేమికులకు షాక్.. మూతపడనున్న తాజ్ మహల్

కాగా, బాధితులంతా సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు సొంత నియోజకవర్గమైన నౌదాన్‌కు చెందినవారే కావడం విశేషం. ఈ ఘటనపై సీఎం స్పందించారు. రోగులకు తగిన మందులు, ఇతర వస్తువుల కొరత లేకుండా చూసుకోవాలని జిల్లా పరిపాలన, ఆరోగ్య శాఖను ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఏజెన్సీల నుంచి పూర్తి నివేదికను కూడా కోరింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ (హమీర్‌పూర్) డాక్టర్ ఆర్‌కె అగ్నిహోత్రి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రజలకు చికిత్స అందించేందుకు ఆరోగ్య శాఖ బృందాలు బాధిత గ్రామాలకు చేరుకున్నాయి. జలశక్తి శాఖ అధికారులు రంగంలోకి దిగారు. బాధిత గ్రామాలకు నీటి సరఫరా నిలిపివేసి శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం పంపారు. సరఫరా నిలిపివేసిన తర్వాత ప్రజలకు బాటిల్ వాటర్ పంపిణీ చేస్తున్నారని ఆ శాఖ జూనియర్ ఇంజనీర్ తెలిపారు. గ్రామాల్లో వైద్యులు, ఆరోగ్య, ఆశా వర్కర్ల ద్వారా నిత్యావసర మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, క్లోరిన్ మాత్రలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేసినట్లు డిప్యూటీ కమిషనర్ దేబశ్వేత బానిక్ తెలిపారు.

Exit mobile version