Robbery: తనిష్క్‌లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..

Tanishq

Tanishq

తమిళనాడులోని మదురైలో భారీ చోరీ కలకలం రేపింది. పళంగనాథం ప్రాంతంలోని ప్రముఖ జువెలరీ బ్రాండ్ తనిష్క్ షోరూమ్‌లో దుండగులు అత్యంత చాకచక్యంగా ప్రవేశించి సుమారు రూ. 50 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. 15 నుంచి 20 కిలోల వరకు బంగారం చోరీకి గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ షోరూమ్ భవన నిర్మాణ పనులు సుమారు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. కేవలం 10 నుంచి 15 రోజుల క్రితమే ఈ నూతన షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. షోరూమ్ వెనుక వైపు తలుపులు, షట్టర్ తాళాలను పగలగొట్టడంతో పాటు షాపు గోడకు కన్నం వేసి దొంగతనానికి పాల్పడినట్లు నిర్వాహకులు గుర్తించారు.

11వ తేదీ ఉదయం సిబ్బంది షోరూమ్‌కు తిరిగి వచ్చినప్పుడు తలుపులు పగలగొట్టి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి చూడగా, ఆభరణాలు మాయమైనట్లు తేలింది. వెంటనే షోరూమ్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

పోలీసులు షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో ఒకే ఒక్క అనుమానితుడు భవనం పైఅంతస్తులోని లిఫ్ట్ మార్గం (లిఫ్ట్ ప్యాసేజ్) ద్వారా లోపలికి ప్రవేశించినట్లు రికార్డయింది. కొత్తగా ప్రారంభమైన షోరూమ్‌లో నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండటాన్ని ఆసరాగా చేసుకుని దొంగ ఈ పథకం వేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. చోరీకి గురైన బంగారం, వజ్రాల కచ్చితమైన పరిమాణం, విలువపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.