ఇప్పటికే వరదలతో అతలాకుతలమైన పాపువా న్యూ గినియాను మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై భూకంపం 6.9 తీవ్రతగా నమోదైంది. ఐదుగురు మృతి చెందగా.. 1,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.
పసిఫిక్ మహాసముద్రంలోని పపువా న్యూగినీ ద్వీప దేశాన్ని పెను భూకంపం అతలాకుతలం చేసింది. తూర్పు సెపిక్ ప్రావిన్స్‌లో 6.9 తీవ్రతతో సంభవించిన భూప్రకంపనల ధాటికి వెయ్యికిపైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటివరకు అయిదుగురు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అంబుంటి పట్టణ సమీపంలో 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
సెపిక్ నది వరదల కారణంగా తూర్పు సెపిక్ ప్రావిన్స్ ఇప్పటికే తీవ్రంగా ప్రభావితం కాగా.. తాజా విపత్తుతో పరిస్థితులు మరింత దిగజారాయని స్థానిక గవర్నర్ అలన్ బర్డ్ వెల్లడించారు. నది పొడవునా 800 కిలోమీటర్ల మేర 60 నుంచి 70 గ్రామాలు వరద గుప్పిట్లో ఉన్నాయి. దీనికి సంబంధించిన సహాయక చర్యలు కొనసాగుతుండగానే భూకంపం సంభవించింది. దీంతో నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించినప్పుడు దేశంలోని సెపిక్ నది ఒడ్డున ఉన్న డజన్ల కొద్దీ గ్రామాలు ఇప్పటికే పెద్ద వరదలతో మునిగియున్నాయి. తాజా భూకంపంతో కొండచరియలు విరిగిపడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
