NTV Telugu Site icon

Manchu pallaki Movie: దర్శకుడు వంశీ తొలి చిత్రం ‘మంచుపల్లకీ’!

Manchupallaki Movie

Manchupallaki Movie

Manchu pallaki Movie: దర్శకుడు వంశీ తొలిసారి మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చిత్రంలోనే చిరంజీవి, సుహాసిని మొదటిసారి కలసి నటించడం విశేషం! ఆ సినిమా పేరు ‘మంచుపల్లకీ’. 1982 నవంబర్ 19న విడుదలైన ‘మంచుపల్లకీ’ యువత మదిని దోచింది. ఈ చిత్రానికి తమిళంలో రూపొంది ఘనవిజయం సాధించిన ‘పాలైవాన సోలై’ చిత్రం ఆధారం. తమిళంలో తాను పోషించిన పాత్రనే తెలుగులో సుహాసిని ధరించారు. ‘కొత్తజీవితాలు’తోనే తెలుగువారి ముందు నిలచిన సుహాసినికి ఈ సినిమా నటిగా మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.

‘మంచుపల్లకీ’ కథ ఏమిటంటే – శేఖర్, హరి, వాసు, కుమార్, గాంధీ ఉద్యోగాల వేట సాగిస్తూ ప్రతీరోజూ సాయంత్రం కలుసుకుంటూ ఉంటారు. వాళ్ళంతా ఓ కాలనీలోని పిట్టగోడపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరిలో శేఖర్ మంచి చిత్రకారుడు. ఓ యాడ్ కంపెనీలో ఉద్యోగం చేస్తూంటాడు. కానీ, తన ఆవేశం కారణంగా వదిలేస్తాడు. హరి నటుడు కావాలన్న అభిలాషతో ప్రయత్నాలు సాగిస్తూ ఉంటాడు. ఓ సారి మోసపోతాడు కూడా. వాసు దిగువ మధ్య తరగతికి చెందినవాడు. ఓ కంపెనీలో చిరుద్యోగి. అతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఓ తమ్ముడు కూడా ఉంటారు. వారి బాధ్యత అతనిదే. కుమార్ ఓ ధనవంతుని తనయుడు. గాంధీ ఉద్యోగాల వేటలో బిజీ. వీరుండే కాలనీలోకి గీత అనే అమ్మాయి, ఆమె తండ్రి చేరతారు. తొలి చూపులోనే గీత ఈ ఐదుమందినీ ఆకర్షిస్తుంది. ఓ సారి ఆమె తండ్రితో కుమార్ గొడవపడతాడు.

ఆ తరువాత గీత కారణంగా అందరూ వారితో నేస్తం చేస్తారు. గీత తండ్రి, ఈ ఐదుగురితోనూ సరదాగా ఉంటాడు. శేఖర్ కు గీత అంటే ప్రేమ. ఆమెకు కూడా అతనిపై ఇష్టం ఉన్నట్టు కనిపిస్తుంది. ఆమె ఎక్కడికైనా వెళ్తే శేఖర్ కూడా తోడుగా వెళ్తూ ఉంటాడు. ఇక వాసును ఓ సారి గీత అన్నగా సంబోధిస్తుంది. అప్పటి నుంచీ ఆమెను వాసు కూడా సొంత చెల్లెలుగానే భావిస్తూంటాడు. ఆ ఐదు మంది జీవితాలు గీత రాకతో మారిపోతాయి. అందరూ తమ కాళ్ళపై తాము నిలవాలని నిర్ణయించుకొని తగిన ఉద్యోగాల్లో చేరతారు. వాసు చెల్లెలు పెళ్ళి పదివేల కట్నం ఇవ్వలేని పరిస్థితిలో ఆగిపోతుంది. శేఖర్ నే వాసు చెల్లిని పెళ్ళి చేసుకోమని గీత చెబుతుంది.

తానంటే ఇష్టం లేక అలా చెబుతోందని నిలదీస్తాడు. కానీ, అప్పుడే అతనికో భయంకరమైన నిజం తెలుస్తుంది. గీత ఓ నయం కాని గుండె జబ్బుతో బాధపడుతోందని, ఆమె ఎక్కువ రోజులు బ్రతకదని తెలుసుకుంటాడు. ముందే ఈ విషయం ఎందుకు చెప్పలేదని నిలదీస్తాడు శేఖర్. తన కోసం ఎవరూ బాధపడడం, జాలిపడడం ఇష్టం లేకనే చెప్పలేదని చెబుతుంది గీత. ఆమె అభ్యర్థన మేరకు శేఖర్, వాసు చెల్లిని పెళ్ళి చేసుకుంటాడు. గీత పెళ్ళిమండపంలోనే పడిపోతుంది. ఆసుపత్రిలో గీత చుట్టూ ఈ ఐదుమంది చేరతారు. అందరినీ బాధపెడుతూ గీత నవ్వుతూ కన్నుమూస్తుంది. ఈ ఐదుమంది మిత్రులు ఎప్పుడూ కలుసుకొనే పిట్టగోడపైకి మరో ఐదుమంది కుర్రాళ్ళు వచ్చి కూర్చుని ముచ్చటించుకుంటూండగా చిత్రం ముగుస్తుంది.

Pushpa Movie: పుష్ప 2 కోసం వెయిట్ చేస్తుంటే 1 మళ్లీ వచ్చేలా ఉంది..

ఈ చిత్రంలో శేఖర్ గా చిరంజీవి, గీతగా సుహాసిని, వాసుగా నారాయణరావు, హరిగా రాజేంద్రప్రసాద్, కుమార్ గా సాయిచంద్, గాంధీగా గిరీశ్ నటించారు. మిగిలిన పాత్రల్లో సాక్షి రంగారావు, పి.యల్.నారాయణ, రాజారెడ్డి, భీమేశ్వరరావు, దేవదాస్ కనకాల, ధమ్, అన్నపూర్ణ, పుష్యమి, లక్ష్మీదేవదాస్, మాధవీలత, సోనియా, జయలత కనిపించారు. ఈ చిత్రానికి రాజశేఖర్ కథ అందించగా, యండమూరి వీరేంద్రనాథ్ మాటలు రాశారు. రాజన్-నాగేంద్ర స్వరాలకు శ్రీశ్రీ, వేటూరి, గోపీ పాటలు పలికించారు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేమూరి సత్యనారాయణ సమర్పణలో ఎమ్.ఆర్.ప్రసాద్ నిర్మించారు.

‘మంచుపల్లకీ’లోని “పగలు రేయిలో జారకముందే…”, “మనిషే మణిదీపం…”, “నీ కోసమే మేమందరం…”, “మేఘమా దేహమా….” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. తమిళంలో మంచి విజయం సాధించిన ఈ కథ తెలుగులో ఎందుకనో అంతగా అలరించలేకపోయింది. అయితే, ఈ సినిమా చూసిన యువతను మాత్రం ఓ మధురమైన బాధకు లోను చేసిందీ చిత్రం. తొలి ప్రయత్నంలో విఫలమైన వంశీ తరువాత రెండేళ్ళకు తెరకెక్కించిన ‘సితార’తో విజయం సాధించారు. ఆ తరువాత తనదైన మార్కు చూపిస్తూ వంశీ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నారు.