NTV Telugu Site icon

SSC Paper Leak: పదో తరగతి పేపర్‌ లీక్‌ కేసు.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్

Paper Leak Case

Paper Leak Case

SSC Paper Leak: పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తీవ్రంగా స్పందించారు. ఈ పేపర్‌ లీక్ వ్యవహారంలో నలుగురు ఉద్యోగులను వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి సస్పెండ్‌ చేశారని వెల్లడించారు. చీఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్ శివకుమార్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ కె.గోపాల్‌, ఇన్విజిలేటర్లు ఎస్‌.బందెప్ప, సమ్మప్పపై సస్పెన్షన్‌ వేటు వేశారని తెలిపారు. బందెప్ప, సమ్మప్పలపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. వారిపై శాఖాపరమైన చర్యలతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చామన్నారు. పదో తరగతి తెలుగు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కాగా.. కాసేపటికే 9.37 గంటలకు బందెప్ప మరో ఉద్యోగి సమ్మప్పకు వాట్సాప్‌ పంపించారని వెల్లడించారు. బందెప్ప చేసింది మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుందన్నారు. ఇదిలా ఉండగా.. పరీక్ష నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగలేదని.. రేపటి పరీక్ష యథాతథంగా నిర్వహిస్తామని తెలిపారు.

నలుగురిని సస్పెండ్ చేశాం: కలెక్టర్

తాండూరులో పదో తరగతి క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్ చేశామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శివకుమార్, గోపాల్, బందెప్ప, సమ్మప్పలను సస్పెండ్ చేశామన్నారు. శ్రీనివాస్ అనే టీచర్‌ను ఇన్విజిలేటర్‌గా తొలగించామని తెలిపారు. పేపర్‌ను ఇన్విజిలేటర్ ఫోటోలు తీసి కావాలని మీడియా గ్రూప్‌లో పోస్ట్ చేసి డిలీట్ చేశారని ఆయన చెప్పారు. బందెప్ప ఫొటోస్ సమ్మప్పకు పంపించాడు. అనంతరం వారిద్దరు తప్పు నాది కాదంటే నాది కాదని ఇద్దరు అన్నారు. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేశారని.. ఇద్దరిపై కేసు నమోదైందని కలెక్టర్ పేర్కొన్నారు. బందెప్ప ఉద్దేశపూర్వకంగా ఫోటోలు తీసినట్టు తెలుస్తోందన్నారు. విద్యార్థులు అధైర్యపడొద్దని.. పదోతరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామని, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దన్నారు.

ఇద్దరిని విచారిస్తున్నాం: అడిషనల్ ఎస్పీ
బందెప్ప, సమ్మప్పలపై కేసు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ మురళీధర్ వెల్లడించారు. ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ కాలేదని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రశ్నాపత్రం ఎవరెవరికి పంపారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. వారి ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని.. సీసీ కెమెరాల ద్వారా టైం టు టైం ఎక్కడ నుండి పేపర్ ఎక్కడికి వెళ్లింది అనేది దర్యాప్తు చేశామన్నారు. పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లో పంపిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బందెప్పపై కొద్ది మాసాల క్రితం పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆయన పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థినిని వేధించడంతో కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరోసారి బందెప్ప వార్తల్లో నిలిచారు. ప్రశ్నాపత్రం వైరల్ కాకముందే అలర్ట్ అయ్యామని అడిషనల్ ఎస్పీ చెప్పారు. ఎక్కడ కూడా మాస్ కాఫీ జరగలేదు.. పేపర్ బయటికి వెళ్లలేదన్నారు. ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.