NTV Telugu Site icon

Tuni Municipal Vice Chairman Election: మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ.. చైర్మన్ ఇంట్లోనే 17 మంది కౌన్సిలర్లు!

Tuni Municipal Office

Tuni Municipal Office

తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ‘చలో తుని’ పిలుపునిచ్చిన నేపథ్యంలోరాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. రాజా ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. తుని వెళ్లొద్దంటూ రాజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. తుని వెళ్లకుండా పోలీసులు రాజాను అడ్డుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దాంతో రాజమండ్రి ప్రకాష్ నగర్‌లో ఉన్న రాజా ఇంటి వద్ద ఉధృత పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.

రాజమండ్రిలో మాజీమంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇళ్ల వద్ద పోలీసు టికెటింగ్ ఏర్పాటు చేశారు. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో సెక్షన్ 163(2) బీఎన్ఎస్ఎస్ చట్టం అమలు పర్చారు. ఐదుగురు వ్యక్తులు కంటే ఎక్కువ గుమిగుడకూడదు.. సభలు, సమావేశాలు పెట్టకూడదు.. ఆయుధాలు, కర్రలు, రాళ్లు, అగ్ని ప్రమాదాలు సంభవించే వస్తువులు, ఇతర ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని నిషేధించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది.

మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంటిలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు, 17 మంది కౌన్సిలర్లు బసచేశారు. మరికొద్ది సేపట్లో మున్సిపల్ చైర్మన్ సుధారాణి ఇంటికి వైసీపీ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం రానున్నారు. మున్సిపల్ చైర్మన్ ఇంటి నుండి మున్సిపల్ కార్యాలయం వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. బారికెట్లు ఏర్పాటు చేసి స్థానికులు ఎవరు ఇటువైపు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు సుధారాణి ఇంటికి చేరుకుంటున్నారు.