Site icon NTV Telugu

Medical Colleges Lose Recognition: 150 మెడికల్‌ కాలేజీలకు గుర్తింపు రద్దు!.. ప్రతిపాదనలు రెడీ

Nmc

Nmc

Medical Colleges Lose Recognition: దేశంలో 150 మెడికల్‌ కాలేజీలకు ఈ ఏడాది 2023-24లో గుర్తింపు రద్దయ్యే అవకాశాలున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సిద్ధం చేసినట్టు సమాచారం. నెల రోజులుగా ఎన్‌ఎంసీ చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డ అంశాల ఆధారంగా కమిషన్‌ ఆయా కాలేజీలకు ఈ ఏడాది(2023-24) గుర్తింపును ఇవ్వకూడదని నిర్ణయించినట్టు సమాచారం. ఎన్‌ఎంసీ ప్రమాణాలను పాటించకపోవడంతోపాటు.. నిబంధనలు అమలు చేయని 40 కాలేజీలు ఇప్పటికే గుర్తింపును కోల్పోయినట్టు అధికార వర్గాలు ప్రకటించాయి. కాలేజీల గుర్తింపు రద్దు చేయడానికి ప్రధాన కారణం సరిపడా బోధనా సిబ్బంది లేకపోవడంతోపాటు నిబంధనలను పాటించకపోవడమేనని అధికారులు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ నిబంధనలు అమలు చేయని.. సరిపడా బోధనా సిబ్బందిని ఏర్పాటు చేయని మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య అందించాలని, మంచి వైద్యులను తయారు చేయాలని కేంద్ర మంత్రి సూచించిన విషయం తెలిసిందే.

తనిఖీలు చేసిన ఎన్‌ఎంసీ
ఎన్‌ఎంసీకి చెందిన అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నెల రోజులుగా మెడికల్‌ కాలేజీల్లో తనిఖీలను నిర్వహించారు. తనిఖీల్లో సిసిటివి కెమెరాల ఏర్పాటు, ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ హాజరు విధానాల్లో లోపాలు, బోధనా సిబ్బంది నియామకంలో లోపాలు బయటపడ్డాయి. అధ్యాపకుల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తనిఖీల్లో కమిషన్‌ అధికారులు గుర్తించారు.

ఏఏ రాష్ర్టాల్లోని కాలేజీలంటే..
గుర్తింపు రద్దయ్యే మెడికల్‌ కాలేజీలు దేశంలోని గుజరాత్, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, త్రిపుర మరియు పశ్చిమ బెంగాల్‌లో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

కాలేజీలకు అప్పీల్‌కు అవకాశం
గుర్తింపు రద్దయ్యే మెడికల్ కాలేజీలకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుందని ఎన్‌ఎంసీ వర్గాలు తెలిపాయి. మొదటి అప్పీల్‌ను 30 రోజుల్లోగా ఎన్‌ఎంసీలో చేయవచ్చన్నారు. అక్కడ అప్పీలు తిరస్కరణకు గురైతే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆశ్రయించవచ్చని అధికారులు చెబుతున్నారు.

Exit mobile version