NTV Telugu Site icon

Doctors On Strike: నిరవధిక సమ్మెకు దిగిన ప్రభుత్వ వైద్యులు.. కారణమేంటంటే?

Doctors Strilke

Doctors Strilke

Doctors On Strike: మధ్యప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు బుధవారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ సహోద్యోగులకు సౌకర్యాలు కల్పించడం, బ్యూరోక్రాటిక్ జోక్యానికి ముగింపు పలకడం వంటి అనేక డిమాండ్లపై 13,000 మంది వైద్యులు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమవడంతో మధ్యప్రదేశ్ శాస్కియ స్వశాసి చికిత్సక్ మహాసంఘ్ ఆధ్వర్యంలో వివిధ వైద్య సంఘాలు ఈ ఆందోళనను నిర్వహిస్తున్నాయి. దాదాపు 13,000 మంది వైద్యులు నిరసనలో పాల్గొంటున్నారని మహాసంఘ్ పేర్కొంది. ఫిబ్రవరిలో కూడా వైద్యులు ఇదే తరహాలో నిరసనకు దిగారు. నిరసన నేపథ్యంలో ఔట్ పేషెంట్ సేవలు, ఇతర ముఖ్యమైన ఆసుపత్రి సేవలను ఈ సమ్మె ప్రభావితం చేసే అవకాశం ఉంది.

రాబోయే సమ్మెపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్లు, డివిజనల్ కమిషనర్‌లతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో వైద్య సదుపాయాలు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.సమావేశం అనంతరం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. “ఆరోగ్య సేవలు, అత్యవసరమైన సేవలను నిర్వహించడానికి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. అత్యవసర, క్లిష్టమైన సేవలను సజావుగా నిర్వహించడానికి ఎటువంటి అవకాశాన్ని వదిలివేయవద్దు. ఈ సమ్మె అనైతికమైనది, దీని కోసం చర్యలు తీసుకోవాలని, వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో అవసరమైన ఏర్పాట్లు చేయండి. పీజీ వైద్యుల సేవలను తీసుకోండి.” అని అధికారులను ఆదేశించారు.

Read Also: Horrific Accident: బైకర్‌ను ఢీకొట్టి.. కారుపై మృతదేహంతో 3కి.మీ లాక్కెళ్లారు..

ప్రైవేటు ఆసుపత్రుల సహాయం తీసుకోవాలని అధికారులను కోరిన సీఎం.. రోగులకు ఆయుష్మాన్ యోజన కింద ప్రభుత్వం చికిత్స అందిస్తుందని చెప్పారు. మనిషి ప్రాణాలను కాపాడేందుకు వైద్యులను భగవంతుని స్వరూపంగా పరిగణిస్తారని.. మనిషి జీవితంతో ఆడుకోవద్దని అన్నారు. భోపాల్ జిల్లాలో ప్రభుత్వ వైద్య సదుపాయాలను నిర్వహించేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భోపాల్ కలెక్టర్ ఆశిష్ సింగ్ రాష్ట్ర రాజధానిలోని అతిపెద్ద ప్రభుత్వ హమీడియా ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ.. “ప్రైవేటు ఆసుపత్రుల నుంచి నూట యాభై మంది వైద్యులను ఇక్కడకు పిలిపించారు. వారు ఔట్ పేషెంట్ విభాగం (OPD), వార్డులలో పనిచేస్తున్నారు.” అని తెలిపారు. 672 మంది రోగులు హమీడియా ఆసుపత్రిలో చేరారని, అక్కడ అన్ని సౌకర్యాలు సజావుగా నడుస్తున్నాయని కలెక్టర్ చెప్పారు.రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లో 1500 పడకలు బుక్ చేసుకున్నామని, ఇక్కడి నుంచి తరలించిన వారికి లేదా ప్రభుత్వ అంబులెన్స్‌లలో చేరిన వారికి ఈ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందజేస్తామని, రోగులెవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్‌ తెలిపారు.క్రిటికల్ పేషెంట్లను పెద్ద ప్రైవేట్ ఆసుపత్రులకు తరలిస్తున్నారని భోపాల్ డివిజన్ డివిజనల్ కమిషనర్ మల్ సింగ్ భయదియా తెలిపారు.

నిరసనకు నాయకత్వం వహిస్తున్న మధ్యప్రదేశ్ శాస్కియా స్వశాసి చికిత్సక్ మహాసంఘ్ కార్యకర్త ఒకరు మాట్లాడుతూ.. “మంత్రి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీతో మేము ఫిబ్రవరి 17 న మా ఆందోళనను విరమించుకున్నాము. కానీ ఎటువంటి మార్పు లేదు.” అని చెప్పారు. ఆఫీస్ బేరర్ మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యుల కోసం ఈ పోరాటం చేస్తున్నాం. పాఠశాల, గృహవసతి వంటి సౌకర్యాలు లేని ప్రాంతాల్లో వారానికి 7 రోజులు సెలవులు తీసుకోకుండా పనిచేస్తున్నారు.” అని చెప్పారు. ఆందోళన చేస్తున్న వైద్యుల డిమాండ్ల వల్ల రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక భారం పడబోదని తేల్చి చెప్పారు. తమ పనిలో బ్యూరోక్రాటిక్ జోక్యం గురించి మాట్లాడుతూ.. పరిపాలన అధికారులు ఆరోగ్య విభాగాన్ని బందీగా ఉంచినట్లు కనిపిస్తోందన్నారు. వైద్యారోగ్య శాఖను పరిపాలనా అధికారుల బారి నుంచి గట్టెక్కించేందుకు సీఎం జోక్యం చేసుకోవాలని సూచించారు.