తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరీక్షా పత్రం లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. లీకేజీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా బుధవారం (మార్చి 26) కూడా కామారెడ్డిలో లీకేజీ ఘటన చోటుచేసుకుంది. జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో సిబ్బంది పరీక్షా పత్రంలోని కొన్ని ప్రశ్నలను లీక్ చేశారు.
బుధవారం కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి పరీక్షా పత్రం లీకేజీ అయింది. పరీక్షకు కొన్ని నిమిషాల ముందు సిబ్బంది కొందరు ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. ఆ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. జుక్కల్ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీం, ఇన్విజిలేటర్ దీపికపై సస్పెన్షన్ వేటు వేశారు.