100 Airports: వచ్చే ఏడాది నాటికి మన దేశంలో వంద విమానాశ్రయాలు డెవలప్ కానున్నాయి. ఇందులో భాగంగా.. ఇప్పటికే ఉన్న ఎయిర్‌పోర్టులను ఉన్నతీకరించటం మరియు ఆధునికీకరించటం జరుగుతుంది. ఉదే దేశ్ కా ఆమ్ నాగ్రిక్.. అంటే.. ఉడాన్ అనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ కింద ఈ పనులు చేపడతారు. ఈ ప్రాంతీయ అనుసంధాన పథకం కింద ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇతర ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు వీటిని పూర్తి చేస్తారు.
భూమి అందుబాటులో ఉండటం, వాణిజ్యపరమైన సాధ్యాసాధ్యాలు, సామాజిక-ఆర్థిక అంశాలు, ప్రయాణికుల రద్దీ, విమానయాన సంస్థల ఆస్తకి తదితర అంశాలను ఈ మేరకు పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు ఇతర ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు 2025 నాటికి 98 వేల కోట్ల రూపాయల ఖర్చుతో వివిధ ప్రాజెక్టులను అమలుచేయనున్నారు.
read more: Air India: చరిత్ర సృష్టించనున్న ఎయిరిండియా
గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు మరియు కొత్త టెర్మినల్స్ నిర్మాణం, విస్తరణ, ఇప్పటికే ఉన్న టెర్మినల్స్ ఆధునికీకరణ, రన్‌వేల బలోపేతం తదితర కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈ 98 వేల కోట్ల రూపాయల్లో పాతిక వేల కోట్ల రూపాయలకు పైగా నిధులను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవ్వనుంది. మిగతా డబ్బును ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లు, డెవలపర్లు సమకూరుస్తారు.
కొత్తగా నిర్మించనున్న ఎయిర్‌పోర్టుల లిస్టులో ఏపీలోని భోగాపురం ఉంది. ఉన్నతీకరణ మరియు ఆధునికీకరణ చేపట్టనున్న విమానాశ్రయాల జాబితాలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చోటు లభించింది. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ రాజ్యసభ్యలో లిఖితపూర్వకంగా వెల్లడించారు.