Site icon NTV Telugu

Gaurav Taneja: బర్త్‌డే పేరిట అభిమానుల హల్‌చల్.. పాపులర్ యూట్యూబర్ అరెస్ట్

Gaurav Taneja

Gaurav Taneja

ఉత్తరప్రదేశ్‌లో ఓ యూట్యూబర్ గౌరవ్ తనేజాను పోలీసులు అరెస్ట్ చేశారు. తన పుట్టిన రోజు వేడుకను నోయిడాలోని సెక్టార్-51 మెట్రో స్టేషన్ దగ్గర జరుపుకోవడానికి ప్రయత్నించారు. దాంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లయింగ్ బీస్ట్‌గా పేరొందిన యూట్యూబర్ గౌరవ్ తనేజా అతని పుట్టినరోజును జరుపుకోవడానికి శనివారం నోయిడాలోని ఆక్వా లైన్ సెక్టార్ 51 మెట్రో స్టేషన్‌లో అతని అభిమానులు గుమిగూడడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నిబంధనల ఉల్లంఘన పేరిట పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అంతకుముందు.. అతను తన పుట్టినరోజును నోయిడా మెట్రోస్టేషన్‌లో అభిమానుల మధ్య జరుపుకొంటున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. ఈ మేరకు ఓ మెట్రో కోచ్‌నూ బుక్‌ చేసినట్లు సమాచారం. దీంతో అతన్ని కలిసేందుకు వేలాది మంది.. మెట్రోస్టేషన్‌కు చేరుకున్నారు. ఒక్కసారిగా తలెత్తిన రద్దీ కారణంగా స్థానికంగా తొక్కిసలాట జరిగింది.

రద్దీ కారణంగా మెట్రో ప్రయాణికులు, మెట్రో సిబ్బంది ఇబ్బందుల పాలయ్యారు. వేడుకల్లో పాల్గొనడానికి వచ్చిన వారికి మెట్రోస్టేషన్‌ కింద టోకెన్లను పంపిణీ చేయడంతో.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సకాలంలో అక్కడి చేరుకుని రహదారులను క్లియర్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో నిబంధనలు ఉల్లంఘించారంటూ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ‘ఫ్లయింగ్ బీస్ట్’ పేరిట ఉన్న అతని యూట్యూబ్‌ ఛానెల్‌కు 75.8 లక్షలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గౌరవ్ తనేజా తన అద్భుతమైన కంటెంట్ ద్వారా పాపులర్ యూట్యూబర్‌గా నిలిచాడు. భారత్‌లో టాప్ యూట్యూబర్లలో తనేజా కూడా ఒకడు. గౌరవ్ తనేజా నెలవారీ ఆదాయం 30 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. అతనికి వేలాది సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

Exit mobile version