మరోసారి రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల వేట ప్రారంభమైంది. ఢిల్లీలో ఇవాళ మరోసారి విపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు విపక్షాలు మరోసారి భేటీ కానున్నాయి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు. ఇక మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు మంగళవారం నాటి భేటీకి తాను హాజరవుతున్నట్లు ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ వెల్లడించారు. ఉత్కంఠగా సాగుతుందునుకున్న రాష్ట్రపతి ఎన్నికల పోరు విపక్షాలకు అభ్యర్థి దొరకకపోవడంతో చప్పగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించడంతో ఆయన నో చెప్పారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తాను పోటీ చేయనని తప్పుకున్నారు. తర్వాత బెంగాల్ మాజీ గవర్నర్, గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును మమత ప్రస్తావించగా.. తాను కూడా ఈ ఎన్నికల్లో పనిచేయనని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది.
దీంతో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాతో ప్రతిపక్ష నేతలు చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రధాని మోదీని పలు సందర్భాల్లో తీవ్రంగా విమర్శించిన యశ్వంత్.. టీఎంసీలో చేరిన విషయం తెలిసిందే. విపక్ష నేతలంతా అంగీకరిస్తే మంగళవారం యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేసే అవకాశాలున్నాయి. కాగా ప్రతిపక్షాల ఐక్యతను, జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని నిర్ణయించాలని గోపాలకృష్ణ గాంధీ అన్నారు. తనను రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలని అడిగినందుకు విపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ఏకాభిప్రాయాన్ని సాధించగలిగిన నాయకుల్లో తనకంటే మెరుగైన వారు ఉన్నారని భావిస్తున్నానని, అలాంటి వారికి అవకాశం ఇవ్వమని కోరినట్లు వివరించారు. బెంగాల్ సీఎం మమతకు ఇతర అపాయింట్‌మెంట్లు ఉన్నందున ఆమె హాజరవ్వకపోవచ్చని సమాచారం. టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జీ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Presidential Poll: నేడు రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్న ఎన్డీఏ?
