రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున అభ్యర్థిగా బరిలోనికి దిగేందుకు యశ్వంత్ సిన్హా సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీజేపీ మాజీ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విపక్షాల తరఫున అభ్యర్థి ఆయనేనా? అని చర్చ జరుగుతోంది. టీఎంసీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. జాతీయ ప్రయోజనాల కోసం, విపక్షాల ఐక్యత కోసం పని చేయడానికి పార్టీ నుంచి బయటకు రావాల్సిన ఈ సమయం తప్పనిసరిగా భావిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు.
యశ్వంత్ సిన్హా మాజీ ఐఏఎస్ అధికారి. 1984లో జనతాదళ్‌లో చేరారు. గత ఏడాది బీజేపీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పని చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు యశ్వంత్ ప్రకటనతో రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు అభ్యర్థిగా పోటీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి పదవికి అభ్యర్థి కోసం ప్రతిపక్షాల వేట కొలిక్కి వచ్చినట్లు రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలో ఇవాళ మరోసారి విపక్ష నేతలు సమావేశం కానున్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అక్కడ యశ్వంత్ సిన్హా పేరును ప్రకటిస్తారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రపతి అభ్యర్థి కోసం ప్రతిపక్షాలు తొలుత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేరును ప్రస్తావించడంతో ఆయన నో చెప్పారు. అనంతరం నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తాను పోటీ చేయనని తప్పుకున్నారు. తర్వాత బెంగాల్ మాజీ గవర్నర్, గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ పేరును మమత ప్రస్తావించగా.. తాను కూడా ఈ ఎన్నికల్లో పనిచేయనని వెల్లడించారు. ప్రతిపక్ష నాయకుల్లో గోపాలకృష్ణ పట్ల ఏకాభిప్రాయం లేకపోవడం, కొన్ని పార్టీలు సమావేశానికి హాజరవకపోవడంతోనే ఆయన వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.