Xi Jinping: మిత్రుడు అనుకున్న అమెరికా భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ, శత్రువుగా భావించే చైనా నుంచి భారత్‌కు హృదయపూర్వక సందేశం వచ్చింది. జి జిన్‌పింగ్ భారతదేశ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు. ‘‘డ్రాగన్-ఏనుగు కలిసి నృత్యం చేయడం’’ రెండు దేశాలకు సరైన ఎంపిక అని ఆయన చెప్పారు. భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘‘చైనా, భారత్ మంచి పొరుగు స్నేహితులు. భాగస్వాములుగా ఉండటం, ఒకరినొకరు విజయవంతం చేసుకోవడం, సహాయపడటం, డ్రాగన్-ఏనుగు టాంగో సరైన ఎంపిక’’ అని అన్నారు.
Read Also: Pakistan T20 World Cup: దాయాదుల మధ్య పోరుకు ఈ రోజు పాకిస్థాన్‌లో హైప్రొఫైల్ మీటింగ్..
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్‌పింగ్ సోమవారం భారత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-చైనాలు మంచి పొరుగుదేశాలుగా, స్నేహితులుగా అభివర్ణించారు. భారత్, చైనా సంబంధాల అభివృద్ధి రెండు దేశాల ప్రాథమిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉందని, ప్రపంచశాంతి, శ్రేయస్సుకు గణనీయంగా దోహదపడుతుందని ఆయన అన్నారు. “సహకారం మరియు అభివృద్ధి అవకాశాల కోసం భాగస్వాములు” అనే ఏకాభిప్రాయానికి ఇరు దేశాలు కట్టుబడి ఉంటాయని, వ్యూహాత్మక సంభాషణల్ని బలోపేతం చేస్తామని, ఒకరి ఆందోళనల్ని మరొకరు పరిష్కరించుకుంటారని, చైనా-భారత్ సంబంధాల ఆరోగ్యకరమైన, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహిస్తాయని జిన్‌పింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
దీనికి ముందు, చైనా ప్రధాని లి కియాంగ్ ప్రధాని మోడీకి అభినందనల సందేశాన్ని పంపారు. 2020లో తూర్పు లడఖ్ ప్రతిష్టంభన తర్వాత నిలిచిపోయిన భారతదేశం- చైనా మధ్య సంబంధాలు, ప్రధాన మంత్రి మోడీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య రెండు శిఖరాగ్ర సమావేశాల తర్వాత మెరుగుపడ్డాయి. కొనసాగుతున్న సరిహద్దు సమస్యల “న్యాయమైన” పరిష్కారానికి కృషి చేయడానికి సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి ఇద్దరూ అంగీకరించారు. ఇటీవల, భారత్ చైనా జాతీయులకు పర్యాటక వీసాలను ఇవ్వడం ప్రారంభించింది. చైనాకు డైరెక్ట్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.
