NTV Telugu Site icon

Kashi Express: ఏసీ కోచ్‌‌లో రద్దీ, హైజాక్ చేశారంటూ ప్రయాణికుడి ఆవేదన.. వైరల్ వీడియోపై స్పందించిన రైల్వే..

Kashi Express

Kashi Express

Kashi Express: ఇటీవల భారత రైల్వే అనేక అపవాదుల్ని మూటగట్టుకుంటోంది. వేలు పెట్టి ఏసీ కోచులు, స్లీపర్ కోచ్‌ల్లో టిక్కెట్లు బుక్ చేసుకుంటున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రద్దీ కారణంగా చాలా మంది ప్రయాణికులు ఏసీ, స్లీపర్ కోచుల్లోకి చొరబడుతుండటంతో టికెట్ ఉన్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే ఎదురైంది. కాశీ ఎక్స్‌ప్రెస్‌లోని సెకండ్ ఏసీ కోచులోకి టికెట్ లేకుండా ప్రయాణికులు ప్రయాణించడాన్ని అందులోని ప్రయాణికుడు ప్రశ్నించారు.

టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్న ఓ వినియోగదారుడు తన దుర్భరమైన పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రద్దీ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇందులో తన అనుభవాలను వివరించారు. ‘‘ టికెట్ లేని ప్రయాణికులు ఏసీ కోచ్‌ని హైజాక్ చేశారని, వాష్ రూమ్‌లోకి వెళ్లే మార్గాన్ని కూడా అడ్డుకున్నారని, కోచ్ తలుపుల వద్ద నిలబడ్డారని, డోర్లు తెరిచి ఉండటంతో ఏసీ కూడా సరిగా పనిచేయాలేదని’’ పేర్కొన్నాడు.

Read Also: DK Shivakumar: ‘‘ఓట్లు వేస్తేనే నీరు’’.. డిప్యూటీ సీఎంపై పోలీస్ కేసు..

రద్దీ వీడియోని షేర్ చేసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్యాగ్ చేశారు. ‘‘అశ్విని వైష్ణవ్, సార్, దయచేసి 2 టైర్ ఏసీ పరిస్థితి చూడండి. ఆహారం లేదు, నీరు లేదు. వాష్‌రూమ్ వెళ్లే మార్గం లేదు. ఏసీ పనిచేయడం లేదు. దయచేసి ఏదైనా చర్య తీసుకోండి’’ అని అభ్యర్థించాడు. ఇప్పటి వరు ఈ వీడియోకు 17,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దీనిపై రైల్వే స్పందించింది. ‘‘ అత్యవసర చర్య కోసం సంబంధిత అధికారి డీఆర్ఎం భుసావల్ సంప్రదించాం’’ అని రైల్వే సేవా స్పందించింది.

ఇంతలో నెటిజన్లు వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కఠినమైన నిబంధనలు తేవాలని డిమాండ్ చేశారు. ‘‘ అశ్విని వైష్ణవ్ గారు ఈ పరిస్థితి రైలులో జరుగుతోంది. దయచేసి గమనించండి’’ అని ఒక యూజర్ కామెంట్ చేశారు. ‘‘ ఇది బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్, కఠినమైన అడుగులు వేయాల్సిన సమయం. ఇది మన దేశ ప్రతిష్టను దిగజార్చుతోంది’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ప్రభుత్వం రైళ్లను పెంచాలి’’ అని మరొకరు కోరగా.. ‘‘ అధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వహించడం లేదని’’ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.