Sela Tunnel: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా ఇండో-చైనా బోర్డర్‌లో సైనిక, రవాణా వసతులను మెరుగుపరుస్తోంది. సరిహద్దు వెంబడి సైన్యం సునాయాసంగా కదిలేందుకు వీలుగా రోడ్లను నిర్మిస్తోంది. పలు ప్రాంతాల్లో ఎయిర్ ఫెసిలిటీలు, కమ్యూనికేషన్ వ్యవస్థను బలపరుస్తోంది.
ఇదిలా ఉంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 13,000 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపొడవైన బై-లైన్ సెలా టన్నెల్ మార్గాన్ని పూర్తి చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ 2019లో సెలా టన్నెల్ కి శంకుస్థాపన చేశారు. ఇండో-చైనా బోర్డర్లోని తూర్పు సెక్టార్ వైపు మెరుగైన కనెక్టివిటీ కోసం అరుణాచల్ రాష్ట్రంలో వ్యూహాత్మకంగా భారత్ ఈ సెలా సొరంగాన్ని నిర్మిస్తోంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(BRO) నిర్మిస్తున్న ఈ టన్నెల్‌ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించబడుతోంది. ప్రస్తుతం సెలా టన్నెల్ పనులు చివరి దశలో ఉన్నాయి.
Read Also: Pakistan: పాక్ అణు కమిషన్ కార్యాలయం వద్ద భారీ పేలుడు.!
ఈ ఏడాదిలోగా టన్నెల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ సొరంగ తవాంగ్ ప్రజలకు అన్ని వాతావరణ పరిస్థితుల్లో మంచి రవాణా సౌకర్యాలను అందిస్తుందని. జిల్లాను సందర్శించే పర్యాటకులతో పాటు సాయుధ దళాలకు ఈ టన్నెల్ చాలా కీలకం. ఈ టన్నెల్ నిర్మాణానికి సంబంధించి 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.
సెలా టన్నెల్ ప్రాజెక్టు రెండు సొరంగాలను కలిగి ఉంది. టన్నెల్-1 పొడవు 980 మీటర్లు కలిగిన సింగిల్ ట్యూబ్ టన్నెల్ కాగా.. టన్నెల్-2, 1555 మీటర్ల పొడవైన ట్విన్ ట్యూబ్ టన్నెల్. సెలా టన్నెల్ సెలా పాస్ నుంచి 400 మీటర్ల దిగువన ఉంది. శీతాకాలంలో విపరీతమైన మంచు కురిసే సందర్భాల్లో కూడా ఈ టన్నెల్ గుండా ప్రయాణాలు కొనసాగించవచ్చు. సెలా టన్నెల్‌కు 2019 ఫిబ్రవరి 9న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు, దీని నిర్మాణం ఏప్రిల్ 1, 2019న ప్రారంభమైంది.