Women’s Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ

Women's Reservation Bill 20

Women's Reservation Bill 20

Women’s Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుల్లో కీలక సవరణలు తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో ఈ భేటీ జరగనుంది. మంత్రులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సమాచారం పంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.

మహిళా రిజర్వేషన్ బిల్లులో సవరణలు?

లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించనున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేక వీగిపోయింది. దీంతో ఈసారి బిల్లులో ఎలాంటి మార్పులు చేయాలి? ప్రతిపక్షాల మద్దతు ఎలా పొందాలి? అనే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

నవంబర్ 30 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన ప్రకారం.. నవంబర్ 30న లోక్‌సభ, డిసెంబర్ 2న రాజ్యసభ తిరిగి సమావేశం కానున్నాయి. డిసెంబర్ 3 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ సమావేశాలు వర్షాకాల సమావేశాల కొనసాగింపుగా జరగనున్నాయి. ఆగస్టు 13న పార్లమెంట్ వాయిదా పడినప్పటికీ, నిరవధికంగా వాయిదా వేయడమే తప్ప ప్రొరోగ్ చేయలేదు. దీంతో తక్కువ సమయంలోనే తిరిగి సమావేశాలు నిర్వహించే అవకాశం ఏర్పడింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలోనూ పార్లమెంట్ త్వరలోనే తిరిగి సమావేశమయ్యే అవకాశం ఉందని మోడీ మంత్రులకు సూచించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఢిల్లీ వెలుపల పర్యటనలను వాయిదా వేసుకుని అందుబాటులో ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.

543 నుంచి 850కి లోక్‌సభ స్థానాలు?

ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలో భాగంగా డీలిమిటేషన్ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుత 543 నుంచి గరిష్ఠంగా 850కి పెంచే ప్రతిపాదన ఉంది. ఈ మార్పుల ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందే పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రం భావిస్తోంది. అయితే, ఈ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. ప్రస్తుత 543 స్థానాల ఆధారంగా కనీసం 361 మంది సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం మూడు స్థానాలు ఖాళీగా ఉండటంతో లోక్‌సభలో 540 మంది సభ్యులు ఉన్నారు. అధికార ఎన్డీఏ కూటమికి సుమారు 320 మంది ఎంపీల మద్దతు ఉంది. దీంతో బిల్లు ఆమోదం పొందాలంటే ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా అదనపు మద్దతు అవసరమవుతుంది.

ఎన్డీఏ బలాబలాల్లో మార్పులు

ఈ ఏడాది ఏప్రిల్‌లో బిల్లు ఓడిపోయినప్పటి నుంచి లోక్‌సభలో రాజకీయ సమీకరణాలు మారినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిపక్ష శిబిరం నుంచి 26 మంది ఎంపీలు వైదొలిగినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI)లో విలీనమై ఎన్డీఏకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. అలాగే శివసేన (UBT)కు చెందిన ఆరుగురు ఎంపీలు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరినట్లు తెలిపింది. అయినప్పటికీ బిల్లు ఆమోదానికి అవసరమైన సంఖ్యాబలం సాధించాలంటే ఎన్డీఏకు మరింత మంది ఎంపీల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్)కు చెందిన ఎనిమిది మంది ఎంపీల మద్దతు కీలకంగా మారే అవకాశం ఉంది.

డీలిమిటేషన్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య భిన్నాభిప్రాయాలు

దేశ జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం అవసరమని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వాదిస్తోంది. దీనివల్ల మహిళా రిజర్వేషన్ల అమలుకు అవకాశం ఏర్పడుతుందని చెబుతోంది. అయితే, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రతిపక్ష కూటమి వ్యతిరేకిస్తోంది. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించే వ్యూహంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.