NTV Telugu Site icon

Jammu & Kashmir: రెచ్చిపోయిన ఉగ్రమూక.. టీచర్ మృతి

Teacher Shot Dead In Kashmir

Teacher Shot Dead In Kashmir

జమ్మూ & కశ్మీర్‌లో ఉగ్రమూక మరోసారి రెచ్చిపోయింది. ఓ స్కూల్ టీచర్‌ను మంగళవారం కాల్చి చంపారు. సాంబకు చెందిన రజినీ బాలా (36).. కుల్గాం జిల్లాలోని గోపాల్‌పొర ప్రాంతంలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది. ఇవాళ ఉదయం ఆమెపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో.. తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రజినీ బాలా పని చేస్తోన్న హైస్కూల్‌లోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ దారుణానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని వెంటనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ ఉదంతంపై నేషనల్ కాన్ఫిరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఈ దాడిని ఓ నీచమైన చర్యగా అభివర్ణించారు. “బాధితురాలు రజనీ జమ్మూ ప్రావిన్స్‌లోని సాంబా జిల్లాకు చెందినవారిగా గుర్తించాం. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ ప్రాంతంలో ఆమె ప్రభుత్వ టీచర్‌గా పని చేస్తోంది. తుచ్ఛమైన లక్ష్యంతో జరిగిన దాడిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త రాజ్ కుమార్, కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తున్నా. ఉగ్రదాడి కారణంగా మరో కుటుంబం విషాదంలోకి వెళ్ళిపోయింది’’ అంటూ ఆయన ట్వీట్. పరిస్థితులు తిరిగి మూమూలయ్యేంత వరకూ తాము విశ్రమించబోమని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు అబ్దులా వెల్లడించారు.

కాగా.. ఇటీవల సెంట్రల్ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో రాహుల్ భట్‌ అనే ప్రభుత్వ ఉద్యోగిని అతని కార్యాలయంలోనే కాల్చి చంపారు. అప్పుడు ఆ ప్రాంతంలో భారీ నిరసనలు జరిగాయి. భట్‌ మూడు వారాల క్రితం అతను చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలో ఉగ్రదాడుల్లో హతమయ్యారు. రాహుల్‌కు 2010-11లో వలసదారుల ప్రత్యేక ఉపాధి ప్యాకేజీ కింద క్లర్క్ ఉద్యోగం దొరికింది.