NVS-02 NavIC: ఇండియన్ స్పేస్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ఇటీవల NVS-02 శాటిలైట్‌ని ప్రయోగించింది. భారతదేశానికి సొంత నావిగేషన్ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశంతో నావిక్ కాన్‌స్టలేషన్‌లో భాగంగా ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపారు. అయితే, ఇప్పుడు NVS-02 సాంకేతిక సమస్యని ఎదుర్కొంది. శాటిలైట్‌లోని లిక్విడ్ అపోజీ మోటార్ (LAM) వ్యవస్థలోని థ్రస్టర్లు మొరాయించాయి. శాటిలైట్ కక్ష్యను పెంచేందుకు ఇవి ఫైర్ కావాలి. శాటిలైట్ వేగాన్ని పెంచేందుకు ఈ ఇంజన్లు మండాల్సి ఉంది. అయితే, ఇప్పుడు ఇవి పనిచేయకపోవడంతో శాటిలైట్ కక్ష్యను పెంచేందుకు అవరోధాలు ఎదురవుతున్నాయి.
ఇంజన్‌లో వైఫల్యం:
లామ్ ఇంజన్లలోని ఆక్సిడైజర్ వాల్వ్‌లో తీవ్రమైన వైఫల్యం ఎదురైనట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రయోగం తర్వాత, NVS-02 విజయవంతంగా జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లో ఉంచబడింది. అయితే, థ్రస్టర్లు పనిచేయకపోవడంతో అది దీర్ఘ వృత్తాకార కక్ష్యలో చిక్కుకుంది. సరైన సమయంలో లామ్ ఇంజన్లను మండించాలి, లామ్ అనేది ప్రెజర్-ఫెడ్ లిక్విడ్ ఇంజిన్.. ఆక్సిడైజర్, ఇంధనం ప్రెషరైజ్డ్ ట్యాంకులలో విడిగా నిల్వ చేయబడతాయి. అయితే, శాటిలైట్‌లో ఆక్సిడైజర్ ప్రవాహాన్ని నియంత్రించే వాల్వ్ తెరుచుకోలేదు. ఫలితంగా కంబర్షన్ ఛాంబర్‌కి ఆక్సిడైజర్ ప్రవాహం జరగలేదు. దీంతో శాటిలైట్ కక్ష్యని పెంచే విధంగా ఇంజన్ మండటం లేదు.
క్రాష్ అవుతుందా..?
35,786 కి.మీ ఎత్తులోని జియో స్టేషనరీ ఆర్బిట్‌లో శాటిలైట్ చిక్కుకుంది. ప్రస్తుతం ఎదురైన వైఫల్యం ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉపగ్రహం భారత నావిగేషన్ సేవలకు చాలా కీలకం. శాటిలైట్ చెక్కుచెదరకుండా ఉంది, ఇతర వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తున్నాయి. ఒకవేళ లామ్ ఇంజన్ పనిచేయకుంటే నిర్దేశిత కక్ష్యకు శాటిలైట్ చేరుకోలేదని ఇస్రో నిర్ధారించింది. దీనిని పరిష్కరించడానికి ఇస్రో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
ఉపగ్రహం ప్రస్తుతం ఉన్న కక్ష్యలోనే ఉపయోగించడానికి ప్రత్యామ్నాయ మిషన్ వ్యూహాలను రూపొందిస్తోంది. ఒక వేళ దిద్దుబాటు చర్యలు లేకుంటే భూమిపై క్రాష్ అయ్యే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం NVS-02 దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉుంది. ఇక్కడ కదలికలు, అంతరిక్ష వాతావరణం డ్రాగ్ దానిపై పనిచేస్తుంది. ఈ డ్రాగ్ అనేది ఉపగ్రహాన్ని కక్ష్య నుంచి బయటకు లాగుతూనే ఉంటుంది. దీని వల్ల భూవాతావరణంలోకి వచ్చి క్రాష్ అయ్యి, కాలి బూడిదయ్యే అవకాశం ఉంది. NVS-02 భారత్ నెక్ట్స్ జనరేషన్ నావిక్ వ్యవస్థలోని రెండో శాటిలైట్. ఇది భారతదేశం, మనదేశ సరిహద్దు నుంచి 1500 కి.మీ వరకు ఖచ్చితమైన నావిగేషన్ డేటా అందిస్తుంది.