Hit-And-Run Law: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన హిట్-అండ్-రన్ చట్టంపై దేశవ్యాప్తంగా ట్రక్ డ్రైవర్లు, ఆపరేటర్లు ఆందోళనలకు పిలుపునిచ్చారు. సోమ, మంగళవారాల్లో పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. మరోవైపు సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు బంకుల ముందు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం నిన్న ట్రక్ సంఘాలతో సమావేశం నిర్వహించింది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రావడంతో ట్రక్కర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Pakistan: 82 ఏళ్ల వయసులో కూడా నచ్చిన మహిళను పెళ్లి చేసుకో.. “లవ్ గురు”గా మారిన పాక్ ప్రధాని
ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆల్-ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ఆందోళన విరమించింది. ‘‘ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో మేం చర్చించాం.. కొత్త రూల్ ఇంకా అమలు కాలేదని ప్రభుత్వం చెప్పాం. భారతీయ న్యాయ సంహిత 106/2 అమలు చేసే ముందు చర్చిద్దామని అందరం చెప్పదలుచుకున్నాం. ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి నిర్ణయం తీసుకుంటాం’’ అని కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా మంగళవారం సాయంత్రం తెలిపారు. కొత్త చట్టాలు ఇంకా అమలు కాలేదు, ఆల్ ఇండియా ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ తో సంప్రదించిన తర్వాతే చట్టాలు అమలవుతాయని అని AIMTC కోర్ కమిటీ చైర్మన్ బాల్ మల్కిత్ చెప్పారు.
కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన ‘భారత న్యాయ సంహిత’లో హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షను పెంచడంతో పాటు భారీ జరిమానా విధించడంపై ట్రక్కర్లు ఆందోళన చెందుతున్నారు. సెక్షన్ 106(2) ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసులో వ్యక్తి మరణానికి కారణమైతే 7 ఏళ్లు జైలు శిక్షతో విధించబడుతుంది. వ్యక్తి మరణిస్తే, ఆ విషయాన్ని పోలీసులుకు, స్థానిక మెజిస్ట్రేట్‌కి తెలిపకుండా అక్కడి నుంచి పారిపోతే 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 7 లక్షల జరిమానా విధించనున్నారు.