WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకుంది వాట్సాప్.. వినియోగదారుల డేటా షేరింగ్ విషయంలో Competition Commission of India (CCI) ఇచ్చిన ఆదేశాలను పాటిస్తామని వాట్సాప్ తెలిపింది. వినియోగదారుల డేటాను మెటాకు చెందిన ఇతర కంపెనీలతో పంచుకునే ముందు వారి నుంచి స్పష్టమైన సమ్మతి తీసుకుంటామని కోర్టుకు వెల్లడించింది. ఈ సమ్మతి ఆధారిత విధానం National Company Law Appellate Tribunal (NCLAT) ఆదేశాలకు అనుగుణంగా అమలు చేస్తామని కంపెనీ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌ను కూడా కోర్టులో దాఖలు చేసింది.
Read Also: TTD: తిరుమల ”దర్శన క్యూలైన్ లో మహిళా భక్తురాలికి పాము కాటు”..? క్లారిటీ ఇచ్చిన టీటీడీ..
విచారణ సందర్భంగా మెటా మరియు వాట్సాప్, NCLAT ఆదేశాలపై మధ్యంతర స్టే కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాయి. అయితే, NCLAT తుది నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ మాత్రం సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్‌లోనే ఉంది. మార్చి 16 నాటికి NCLAT ఆదేశాలను పూర్తిగా అమలు చేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. అమలు పురోగతిపై CCIకి నివేదిక సమర్పిస్తామని కూడా తెలిపింది. ఇక, 2021లో వాట్సాప్ గోప్యతా విధాన మార్పుల నేపథ్యంలో CCI, మెటాపై రూ.213.14 కోట్ల జరిమానా విధించింది. ఆ నిర్ణయాన్ని NCLAT సమర్థించింది. ఈ జరిమానాపై మెటా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.
అసలు వివాదం ఏమిటి?
2021లో వాట్సాప్ తన గోప్యతా విధానాన్ని సవరించింది. ఆ మార్పుల ప్రకారం వినియోగదారుల డేటాను మెటాకు చెందిన ఇతర సంస్థలతో పంచుకునే అవకాశంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో వినియోగదారుల గోప్యత హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. CCI దర్యాప్తు చేపట్టి జరిమానా విధించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతోంది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, టెక్నాలజీ లేదా వ్యాపార నమూనా పేరుతో పౌరుల గోప్యత హక్కులను ఉల్లంఘించలేమని స్పష్టం చేసింది.
వినియోగదారులకు దీని ప్రాధాన్యం
ఈ పరిణామంతో భారతదేశంలోని వాట్సాప్ వినియోగదారులు తమ డేటాపై మరింత నియంత్రణ పొందే అవకాశం ఉంది. ఇకపై తమ డేటాను మెటా లేదా ఇతర అనుబంధ సంస్థలతో పంచుకోవాలా వద్దా అనే నిర్ణయం వినియోగదారుల సమ్మతిపైనే ఆధారపడుతుంది. మొత్తంగా, ఈ కేసు భారతదేశంలో డేటా గోప్యత హక్కులకు సంబంధించిన ఒక ముఖ్యమైన మైలురాయిగా భావించబడుతోంది.
