Avani Dias: ఆస్ట్రేలియన్ జర్నలిస్ట్ అవనీ డయాస్ అంశం ఇటీవల వివాదాస్పదంగా నిలిచింది. తన రిపోర్టింగ్ కారణంగా భారత్‌ని విడిచిపెట్టి వెళ్లాలని అధికారులు కోరారని ఆమె ఎక్స్ వేదికగా ఆరోపించింది. అయితే, ఆమె వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, ఆమె వీసా ఉల్లంఘనలకు పాల్పడిందని కేంద్రం చెప్పింది.
అవనీ డయాస్ ఎవరు..?
అవనీ డయాస్ ఆస్ట్రేలియా ABC న్యూస్‌లో దక్షిణాసియా బ్యూరో చీఫ్‌గా ఉన్నారు. గతంలో ఆమె యూత్ రేడియో స్టేషన్ ట్రిపుల్ జెలో కరెంట్ అఫైర్స్ షో హ్యాక్‌కి హోస్ట్‌గా వ్యవహరించారు. ఈమె 2019 న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్స్ మల్టికల్చరల్ కమ్యూనికేషన్స్ అవార్డ్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ అవార్డుతో సహా పలు జర్నలిస్టిక్ అవార్డులను గెలుచుకున్నారు
అయితే, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాడు. ఇవి పూర్తిగా అసంబద్ధ, ప్రేరేపిత వ్యాఖ్యలని భారత్ కొట్టిపారేసింది. దీనిపై ఆమె గత నెలలో యూట్యూబ్‌లో ఒక నివేదికను ప్రచురించింది.
అవనీ ఏ ఆరోపణలు చేసింది..?
నరేంద్రమోడీ ప్రభుత్వం గురించి క్లిష్టమైన నివేదిక తర్వాత తన వీసా పొడగింపులో సమస్యలను ఎదుర్కొన్నట్లు 32 ఏళ్ల అవనీ ఆరోపించారు. తనను భారత్ తక్షణమే విడిచివెళ్లాలని కోరినట్లు, తనకు లోక్‌సభ ఎన్నికలను కవల్ చేయడానికి అనుమతించలేదని పేర్కొ్ంది. తన రిపోర్టింగ్ కారణంగా వీసా పొడిగింపు లభించదని ప్రభుత్వ అధికారి చెప్పడంతో గత వారం తాను ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చానని అవనీ డయాస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తెలిపారు. నా రిపోర్టింగ్ లైన్ క్రాస్ చేసిందని చెప్పారని, ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం తర్వాత తన విమానానికి 24 గంటల ముందు మరో రెండు నెలలు వీసా పొడగించినట్లు తెలిసింది.
భారత్ స్పందనేంటి..?
జర్నలిస్టు వీసా నిబంధనల్ని ఉల్లంఘించారని కేంద్రం ఆరోపించింది. ఆమె చేసిన ఆరోపణలు తప్పుదోవ పట్టిచేలా ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం ఆమెకు 2 నెలల వీసాను పొడగించినట్లు తెలిపింది. ఎన్నికలు కవర్ చేయడానికి అనుమతించలేదని, దేశం విడిచి వెళ్లమని చెప్పారని ఆమె చేసిన వాదనల్లో నిజం లేదని తెలిపింది. గతంలో ఆమె వీసా కేవలం ఏప్రిల్ 20 వరకు చెల్లుబాటులో ఉందని అధికారులు తెలిపారు.
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ కార్యాలయం, ఇతర దౌత్యవేత్తలు లాబీయింగ్ చేసిన తర్వాత ఎన్నికలు కవర్ చేయడానికి ఏబీసీ న్యూస్ జర్నలిస్టు అవనీ డయాస్‌కి వీసా పొడగించారు. భారత అధికారులు వీసాను పొడిగించినప్పటికీ శ్రీమతి డయాస్ తన ఇష్టానుసారం దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నారని ఆస్ట్రేలియా అధికారులు తెలిపారు.
