NTV Telugu Site icon

Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీకి వియత్నాంలో ఏం పని..?’’ విదేశీ పర్యటనల్ని ప్రశ్నించిన బీజేపీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: ఇటీవల కాలంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్నేయాసియా దేశమైన వియత్నాం వెళ్తున్నారు. అయితే, ఈ విషయంపై బీజేపీ అతడిని ప్రశ్నించింది. వివరాలు వెల్లడించకుండా రాహుల్ గాంధీ తరుచుగా వియత్నాం, ఇతర దేశాలకు పర్యటించడాన్ని శనివారం బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తికి ఇవి తగవని, ‘‘జాతీయ భద్రత’’ గురించి ఆందోళనను బీజేపీ లేవనెత్తింది.

బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘వియత్నాంలో న్యూ ఇయర్, వియత్నాంలో హోలీ..? ఆయన వియత్నాంకు 22 రోజుల సమయం ఇచ్చారు. ఆయన తన సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీకి కూడా అంత సమయం ఇవ్వలేదు’’ అని అన్నారు. రాహుల్ గాంధీకి వియత్నాం పట్ల ఉన్న అసాధారణ అభిమానంపై రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేయగా, మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా జాతీయ భద్రత సమస్యల్ని లేవనెత్తారు.

Read Also: E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌పై కేంద్రం చర్యలు.. కారణం ఏంటంటే..

రాహుల్ గాంధీ తరుకుగా విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్‌ని మాల్వియా కోరారు. ‘‘ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కీలక పదవిలో ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఆయన అనేక రహస్య విదేశీ పర్యటనలు జాతీయ భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి’’ అని అన్నారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సమయంలో రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనకు వెళ్లారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన సమయంలో కూడా ఆయన ఆ దేశానికి వెళ్లారు. 7 రోజుల సంతాప దినాలు ఉన్న సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లడం ఏంటని ఆ సమయంలో బీజేపీ ప్రశ్నించింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల్లో రాహుల్ గాంధీ న్యూఇయర్ వేడుకల కోసం వెళ్లారని బీజేపీ విమర్శించింది. బీజేపీ వాదనలపై స్పందించిన కాంగ్రెస్, రాహుల్ గాంధీ వియత్నాం పర్యటనల్ని సమర్థించింది. ఆ దేశ ఆర్థిక నమూనా అధ్యయనం కోసం వెళ్లారని గతంలో చెప్పింది.