NTV Telugu Site icon

Chandipura Virus: ‘చండీపురా వైరస్’ ఏమిటి.? లక్షణాలు, నివారణ, చికిత్స వివరాలు..

Chandipura Virus

Chandipura Virus

Chandipura Virus: ‘‘చండీపురా వైరస్(సీహెచ్‌పీవీ)’’ గుజరాత్ రాష్ట్రాన్ని కలవరపరుస్తోంది. ఈ వైరస్ కారణంగా నాలుగేళ్ల బాలిక మరణించినట్లు వైద్యాధికారులు చెప్పారు. ఈమెతో పాటు చండీపురా వైరస్ కారణంగా 14 మంది రోగులు మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు 29 కేసులు నమోదయ్యాయి.

ఏమిటీ చండీపురా వైరస్..?

చండీపురా వైరస్ అనేది రాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులోవైరస్ జాతికి చెందిన ఆర్బోవైరస్. దీనిని మొట్టమొదటిసారిగా 1965లో మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో గుర్తించడంతో ఆ గ్రామం పేరునే వైరస్‌కి పెట్టారు. ఇసుక ఈగలు, దోమలు, పేలు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. ఇది తీవ్రమైన జ్వరాన్ని, ఫ్లూ, తీవ్రమైన ఎన్సెఫాలిటిస్(మెదడువాపు)ని లక్షణాలు కలిగి, ప్రాణాంతకంగా మారుతంది. ఈ వ్యాధిన పడేవారిలో పిల్లలే ఎక్కువ ఉంటున్నారు. ఇది అంటువ్యాధి కాదని నిపుణులు చెబుతున్నారు.

లక్షణాలు:

* తలనొప్పి
*జ్వరం. అకాస్మత్తుగా వస్తుంది.
* తరుచుగా వాంతులు.
* కోమా. కొన్ని సార్లు ఈ వైరస్ కోమాకు ఆ తర్వాత మరణానికి దారి తీస్తుంది.
* మూర్చ.

నివారణ:

ముఖ్యం ఇసుక ఈగలను నివారించాలి. కీటకాలు కుట్టకుండా చర్యలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. శాండ్ ఫ్లై‌ లు ఇంటి సమీపంలో లేవని నిర్ధారించుకోవాలి.

చికిత్స:

ప్రస్తుతానికి చండీపురా వైరస్‌కి నిర్ధిష్టమైన వ్యాక్సిన్, యాంటీ వైరల్ చికిత్స లేదు. మరణాలను నివారించేందుకు ముందస్తుగా వ్యాధిని గుర్తించాలి. ఆస్పత్రిలో చేరిన తర్వాత రోగ లక్షణాలను అనుసరించి చికిత్స చేయాల్సి ఉంటుంది. రోగులు డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి, ముఖ్యంగా వాంతులు అవుతున్న సందర్భంలో. తీవ్రమైన నాడీ సంబంధిత లక్షణాలు, రోగి శ్వాసకోశ సమస్యలను నిర్వహించడానికి ఐసీయూ అవసరం. జ్వరాన్ని తగ్గించడానికి యాంటి పైరెటిక్స్ మందులు అవసరం. మూర్ఛని తగ్గించడానికి యాంటీ కాన్వల్సెంట్స్‌ని వాడుతారు.