పశ్చిమ బెంగాల్ పేరు మారబోతుంది. ఈ మేరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య కీలక ప్రకటన చేశారు. పశ్చిమ బెంగాల్ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చనున్నట్లు తెలిపారు. రాష్ట్ర చారిత్రక గుర్తింపును ప్రతిబింబించేలా పేరును మార్చాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడిన సమిక్ భట్టాచార్య.. ‘‘ఇంకెన్ని సార్లు చెప్పాలి? రాష్ట్రం పేరు ‘పశ్చిమ బంగా’గానే ఉంటుంది’’ అని స్పష్టం చేశారు.
రాష్ట్ర పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చే ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని సోమవారం కూడా వెల్లడించారు. ఇకపై ‘పశ్చిమ బంగ్లా’, ‘బంగ్లా’, ‘బంగా’ వంటి పేర్లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అన్నారు. ‘‘పశ్చిమ బంగా భవన్.. వెస్ట్ బెంగాల్‌లోని ‘పశ్చిమ’.. ఇకపై మీరు ‘పశ్చిమ బంగ్లా’, ‘బంగ్లా’, ‘బంగా’ వంటి పేర్లను వినాల్సిన అవసరం ఉండదు. ‘పశ్చిమ బంగా’ రాబోతోంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర చరిత్రతో దాని పేరుకు ఉన్న అనుబంధాన్ని కొనసాగించేలా అసెంబ్లీలో బిల్లును తీసుకురానున్నట్లు తెలిపారు. ‘‘చాలా త్వరలోనే.. మా ప్రభుత్వం తొలి అసెంబ్లీ సమావేశంలోనే ఒక బిల్లును ప్రవేశపెడుతుంది. ఈ రాష్ట్ర పేరు, రాష్ట్ర చరిత్రతో అంతర్గతంగా అనుసంధానమై ఉండేలా చూస్తాం. అదే రాష్ట్ర గుర్తింపుగా ఉంటుంది. అందుకే రాష్ట్రానికి ‘పశ్చిమ బంగా’ అనే పేరు పెట్టబోతున్నాం’’ అని సమిక్ భట్టాచార్య చెప్పారు.
ప్రభుత్వాధినేతగా ప్రధాని మోడీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చేసిన ప్రసంగంపై కూడా సమిక్ భట్టాచార్య స్పందించారు. మోడీ ప్రసంగాన్ని ప్రశంసించారు. దేశంలోని అన్ని పరిపాలనా జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, ప్రభుత్వ అధికారులు సమావేశమై ప్రధాని ప్రసంగాన్ని విన్నారని తెలిపారు. 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం తర్వాత కూడా తన జీవితం దేశానికే అంకితమని మోడీ చెప్పారని పేర్కొన్నారు. స్వామి వివేకానంద, రిషి అరబిందో వంటి ప్రముఖులను మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారని గుర్తుచేశారు. మోడీ ప్రసంగం పార్టీ కార్యకర్తలకే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసి స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానించారు.
మోడీ ప్రజాదరణను చూసి ప్రతిపక్షాలు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భయపడుతున్నారా? అని మీడియా ప్రశ్నించగా సమిక్ భట్టాచార్య స్పందించారు. ‘‘ఆయనను వెళ్లి భయపడుతున్నారా లేదా అని అడగండి. మాకు ఎవరి మీదా భయం లేదు. మేమెవరినీ బెదిరించలేదు, భయపెట్టలేదు. రాహుల్ గాంధీ చిన్న పిల్లవాడు కాదు.. దెయ్యాలకు భయపడటానికి’’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రతిపక్షాల దగ్గర రాజకీయంగా ప్రస్తావించడానికి సరైన అంశాలు లేవని విమర్శించారు. ప్రాధాన్యం లేని అంశాలను ప్రధాన సమస్యలుగా చూపిస్తూ ఎక్కువ కాలం రాజకీయాలు చేయలేరని అన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రభుత్వ మార్పుకు అవకాశం లేదన్న భావన యువతలో ఏర్పడుతోందన్నారు. ప్రధాని మోడీ యువత ఆకాంక్షలు, ఆశలకు అనుసంధానమయ్యారని పేర్కొన్నారు.

