West Bengal Results: తృణమూల్ కోటలో ‘కమల’ వికాసం.. బెంగాల్‌లో ఘనవిజయం దిశగా బీజేపీ అడుగులు

West Bengal Election Result

West Bengal Election Result

West Bengal Results: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. గత పదేళ్లుగా తిరుగులేని శక్తిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC)కి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం మధ్యాహ్నం వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 294 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ (BJP) ఏకంగా 188 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ, అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. అధికార పార్టీ టీఎంసీ కేవలం 100 స్థానాలకే పరిమితమై వెనుకంజలో ఉంది.

అభిషేక్ బెనర్జీ సవాల్‌.. బెడిసికొట్టిన ఫలితం!
డైమండ్ హార్బర్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి విసిరిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఫాల్టా నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ రీపోలింగ్‌కు ఆదేశించిన తరుణంలో, ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “కేంద్రంలోని ‘గుజరాతీ గ్యాంగ్’ నా డైమండ్ హార్బర్ మోడల్‌ను ఏమీ చేయలేదు. దమ్ముంటే యూనియన్ ఆఫ్ ఇండియా (భారత ప్రభుత్వం) వచ్చి ఫాల్టాలో నాతో తలపడాలి” అని ఆయన సవాల్ చేశారు. అయితే ఆయన వాడిన ‘యూనియన్ ఆఫ్ ఇండియా’ అనే పదంపై రాజకీయ విశ్లేషకులు, మేధావులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను ప్రశ్నించేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ప్రస్తుత ఫలితాలను చూస్తుంటే, అభిషేక్ అహంకారపూరిత వ్యాఖ్యలే పార్టీ కొంపముంచాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఫాల్టాలో ఏం జరిగిందంటే..
ఫాల్టా నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన పోలింగ్‌లో టీఎంసీ శ్రేణులు అక్రమాలకు పాల్పడ్డాయని, ఓటర్లను అడ్డుకున్నారని ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్నికల కమిషన్ అక్కడ 285 బూత్‌లలో మే 21న రీపోలింగ్‌కు ఆదేశించింది. ఈ క్రమంలో యూపీకి చెందిన ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మను ఎన్నికల అబ్జర్వర్‌గా నియమించారు. టీఎంసీ అభ్యర్థి, కండబలమున్న నేతగా పేరున్న జహంగీర్ ఖాన్ ఆగడాలను అడ్డుకోవడంలో ఈ అధికారి కీలక పాత్ర పోషించారు. 2021 ఎన్నికల్లో 215 సీట్లతో ప్రభంజనం సృష్టించిన మమతా బెనర్జీకి, ఈసారి ఓటర్లు షాక్ ఇచ్చారు. అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు తీర్పునిచ్చారని బీజేపీ నేత సువేందు అధికారి వెల్లడించారు. మరోవైపు ఇంకా లెక్కింపు పూర్తి కాలేదని, తుది ఫలితాల వరకు వేచి చూడాలని మమతా బెనర్జీ తన కార్యకర్తలకు సూచించారు. ప్రస్తుతానికి 148 మేజిక్ ఫిగర్‌ను బీజేపీ సునాయాసంగా దాటేయడంతో, పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా కాషాయ జెండా ఎగరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.