We Will Contest With BRS In Next Karnataka Elections Says HD Kumaraswamy: కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో తాము బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ కేసీఆర్‌తో కలిసి దేశవ్యాప్తంగా తిరుగుతారన్నారు. కేసీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడు అని.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని కొనియాడారు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ ప్రభావం చూపాలని కోరిన ఆయన.. దేశమంతటా తెలంగాణ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇదే సమయంలో కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ సైతం సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కేసీఆర్ ఓ విజనరీ లీడర్ అని, తెలంగాణలో రైతు బందు లాంటి అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడాడు. కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో తమ జేడీఎస్ పార్టీ బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేస్తుందని చెప్పాడు. రైతు సమస్యలే ప్రధాన ఎజెండాగా కేసిఆర్ పని చేస్తున్నారన్నారు. గడిచిన పదేళ్ళల్లో తెలంగాణ మంచి ప్రగతి సాధించిందన్న నిఖిల్ గౌడ.. ఉద్యమ నాయకుడిగా ఉండి ముఖ్య మంత్రి అయిన కేసిఆర్‌కు దేశంలో ఉన్న అనేక సమస్యలపై మంచి అవగాహన ఉందని పేర్కొన్నాడు.
కాగా.. తెలంగాణ భవన్ వేదికగా జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కూడా హాజరైన సంగతి తెలిసిందే! ఈ సమావేశంలో టీఆర్ఎస్‌గా బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం, ప్రతినిధులు దానికి ఆమోదం తెలపడంతో.. భారత్ రాష్ట్ర సమితిగా జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కుమారస్వామి బీఆర్ఎస్‌కు తన పూర్తి మద్దతును ప్రకటించారు.