కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై కోల్‌కతాలో జూనియర్ వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. న్యాయం కావాలని డిమాండ్ చేస్తున్నారు. విధులు బహిష్కరించి ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశించినా నిరసనలు కొనసాగించారు. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వం డాక్టర్లను చర్చలకు ఆహ్వానించింది. వైద్యులు కూడా ప్రభుత్వ ఆహ్వానాన్ని అంగీకరించి.. షరతులతో కూడిన లేఖను ప్రభుత్వానికి పంపించారు. చర్చలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రావాలని.. అలాగే 30 మంది డాక్లర్లు వస్తారని.. చర్చలకు సంబంధించిన విషయాలను లైవ్ టెలికాస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజాగా డాక్టర్లు పంపించిన లేఖపై ప్రభుత్వం స్పందించింది. గురువారం సాయంత్రం 5 గంటలకు చర్చలకు రావాలని డాక్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది. కేవలం 15 మంది రావాలని.. నబన్నలోని సెమినార్ హాల్‌కు రావాలని పిలిచింది. ప్రత్యక్ష ప్రచారం ఉండబోదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని లేఖలో సర్కార్ పేర్కొంది. సామాన్య ప్రజలకు చికిత్స, ఆరోగ్య సేవలను పునరుద్ధరించడానికి జూడాలు సమావేశానికి రావాలని కోరింది. చర్చలు సజావుగా సాగేలా కేవలం 15 మంది మాత్రమే రావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే ప్రభుత్వ ఆహ్వానంపై జూనియర్ వైద్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. జూడాలు పెట్టిన షరతులకు ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో వైద్యులు చర్చలకు వెళ్తారో లేదో.. అంతా ఉత్కంఠగా ఉంది.
ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యంత క్రూరంగా హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా వైద్యులు రోడ్లు ఎక్కి నిరసనలు వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. దర్యాప్తు సంస్థ మాత్రం కేసును ఎటూతేల్చలేకపోతోంది. ఈ కేసును ప్రస్తుతం సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది.