NTV Telugu Site icon

Wayanad landslides: వయనాడ్ విలయంపై శాస్త్రవేత్తల అనుమానాలివే..!

Wayanadlandslides

Wayanadlandslides

కేరళలోని వయనాడ్‌ను కనీవినీ ఎరుగని రీతిలో భారీ విలయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అందరూ గాఢనిద్రలో ఉండగా మధ్య రాత్రిలో ఒక్కసారిగా కొండచరియలు విరుచుకుపడడంతో గ్రామాలు.. గ్రామాలే నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటికే వంద మంది మృతదేహాలను వెలికితీయగా.. మరికొందరు శిథిలాల్లో చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా వందలాది మంది గాయాలు పాలయ్యారు. ఈ ఘోరం.. కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఒక్కసారిగా ఇంత పెద్ద స్థాయిలో విపత్తు సంభవించడంపై వాతావరణశాఖ నిపుణులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

అయితే ఈ విపత్తుకు అరేబియా సముద్రం వేడెక్కడమే కారణంగా భావిస్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడం కారణంగానే వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయని వాతావరణ శాస్త్రవేత్త చెప్పారు. అరేబియా సముద్రం వేడెక్కడం కారణంగా డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ఏర్పడి.. తక్కువ వ్యవధిలో కేరళలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని.. దీంతో కొండచరియలు విరిగిపడతాయని సీనియర్ వాతావరణ శాస్త్రవేత్త మంగళవారం తెలిపారు.

చురుకైన రుతుపవనాల కారణంగా ఆఫ్‌షోర్ ద్రోణి ప్రభావంతో కాసర్‌గోడ్, కన్నూర్, వాయనాడ్, కాలికట్, మలప్పురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోని అడ్వాన్స్‌డ్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రాడార్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ తెలిపారు. గత రెండు వారాలుగా కొంకణ్ ప్రాంతం తేమగా ఉంది. అరేబియా సముద్రంలో సోమవారం మేసోస్కేల్ క్లౌడ్ వ్యవస్థ ఏర్పడింది. దీని కారణంగా వాయనాడ్, కాలికట్, మలప్పురం, కన్నూర్‌లలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని.. ఫలితంగా స్థానికంగా కొండచరియలు విరిగిపడ్డాయని ఆయన తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో 30 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అభిలాష్ చెప్పారు. అంతేకాకుండా మరో రెండు రోజులు ఇలానే ఉంటుందని తెలిపారు.

మంగళవారం తెల్లవారుజామున కేరళలోని వాయనాడ్ జిల్లాలోని కొండ ప్రాంతాలలో భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో కనీసం 100 మంది మరణించారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.