Vizagites In Delhi Liquor Scam: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్టోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కుంభకోణంలో విశాఖ వాసుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కొన్ని సంస్థల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానంతో.. సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఆ సంస్థల్లో ఎవరెవరు, ఎంతెంత పెట్టుబడులు పెట్టారన్న విషయాలపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఈ మద్యం వ్యాపారంలో భారీగా వ్యాపారం ఉంటుందన్న ఉద్దేశంతో.. విశాఖకు చెందిన కొందరు బడా బాబులతో పాటు కొన్ని సంస్థలు పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే.. ఆ పెట్టుబడులు పెట్టిన డబ్బు వారికి ఎక్కడికి నుంచి వచ్చింది? ఆ డబ్బు వారిదేనా? లేకపోతే ఎవరి తరఫునైనా పెట్టుబడులు పెట్టారా? అనే కోణంలో సీబీఐ విచారిస్తున్నట్టు సమాచారం. వివరాల సేకరణకు సీబీఐ అధికారులు నేరుగా విశాఖకే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా.. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధానం రూపకల్పనలో అవకతవకలు జరిగాయంటూ లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడంతో, సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా 16 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దేశవ్యాప్తంగా సీబీఐ, ఈడీలు ఢిల్లీ, హైదరాబాద్ సహా కొన్ని ప్రముఖ నగరాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ కేసులో ఇప్పటికే ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ మాజీ సీఈవో విజయ్ నాయర్‌ను అరెస్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం విధాన రూపకల్పనలో కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్‌ఎల్‌పీ వ్యవహరించిందనే అభియోగాలున్నాయి. తొలుత ఈ కేసులో విచారణకు హాజరు కావాలని అభిషేక్‌ను ఢిల్లీకి పిలిపించిన అధికారులు.. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు.. ఐదు రోజులపాటు కస్టడీ కోరగా, మూడు రోజుల కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు.
అభిషేక్ వ్యాపారాలకు సంబంధించి సీబీఐ, ఈడీలు ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించాయి. ఎస్‌ఎస్ మైన్స్ అండ్ మినరల్స్ ఎల్‌ఎల్‌పీ, మాస్టర్ సాండ్ ఎల్‌ఎల్‌పీ, సహా చాలా సంస్థల్లో అతనికి భాగస్వామ్యం ఉందని ప్రాథమికంగా గుర్తించాయి. ఈ సంస్థలకు ఆడిటింగ్ నిర్వహిస్తున్న గోరంట్ల అసోసియేట్స్‌లో సోదాలు నిర్వహించగా.. పిళ్లైకి రాష్ట్రానికి చెందిన అనేకమంది ప్రముఖులతో వ్యాపార భాగస్వామ్యం ఉందని, అతని తరఫున అభిషేక్ కీలకపాత్ర పోషించాడని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మరింత మంది ప్రముఖులకు సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
