తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే (TVK) ప్రభుత్వంపై అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.బి.ఉదయ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ పరిపాలనా వైఫల్యాలపై మండిపడ్డారు. రాష్ట్రంలో విపత్తు నిర్వహణ, ప్రజల భద్రత, నిత్యావసర ధరల నియంత్రణను గాలికొదిలేసి.. కేవలం కార్యాలయాల అలంకరణ, తన అనుచరులకు భద్రత కల్పించడానికే సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో ప్రకటన విడుదల చేసినట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (PTI) వెల్లడించింది.
విపత్తు నిర్వహణ గాలికి.. పోలీసుల సెక్యూరిటీపై ఆరోపణలు
ముఖ్యమంత్రి పనులపై తీవ్రస్థాయిలో స్పందించిన ఉదయ్‌కుమార్.. “ముఖ్యమంత్రి పని ఏమిటి? సీఎం కార్యాలయాన్ని ముస్తాబు చేయడం, నేమ్ప్లేట్లు తగిలించుకోవడం, నివాసాన్ని సుందరంగా మార్చుకోవడమేనా? వర్షాలు, విపత్తుల సమయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. కానీ, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడం కూడా మీ ప్రభుత్వానికి చేతకావడం లేదు” అని మండిపడ్డారు. రాష్ట్ర పోలీసు వ్యవస్థను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యుత్తమంగా పేరున్న తమిళనాడు పోలీసులను ప్రజల రక్షణ కోసం కాకుండా, ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ప్రయాణించే సీఎం స్నేహితులు, సన్నిహితుల రక్షణ కోసం ఉపయోగిస్తున్నారని ధ్వజమెత్తారు.
రూ.30 నాణ్యమైన బియ్యం పథకంపై అవినీతి ఆరోపణలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రూ.30 కిలోల సన్నబియ్యం పథకంలో భారీ కుంభకోణం జరిగిందని ఉదయ్‌కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలల్లో బహిరంగ మార్కెట్లో బియ్యం ధర రూ.30 నుంచి రూ.60కి పెరిగిందని, ధరలు రూ.100 దాటకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని తెచ్చినప్పటికీ.. ఇది పగటిపూట దొంగతనంలా మారిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత హయాంలో ఉచితంగా ఇస్తున్న 20 కేజీల బియ్యాన్ని సేకరించి, వాటిని పాలిష్ చేసి, మళ్లీ ప్యాక్ చేసి కిలో రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని ఆరోపించారు.
ఈ బియ్యం తిన్న ప్రజలు అరియలూర్, సేలం, నామక్కల్ తదితర జిల్లాల్లో నిరసనలు తెలుపుతున్నారని తెలిపారు. ఆ బియ్యం నుంచి దుర్వాసన వస్తోందని, కోళ్ల దాణాకు కూడా పనికిరావు కాబట్టి తమ డబ్బులు వెనక్కి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని పేర్కొన్నారు. మార్కెట్ ధరలను నియంత్రించేందుకు ప్రయత్నించి గతంలో డీఎంకే ప్రభుత్వం కుళ్ళిన ఉల్లిపాయలను విక్రయించి ఎలా వ్యతిరేకత మూటగట్టుకుందో, ఇప్పుడు ఈ ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు.
శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
బియ్యం కొనుగోలు ప్రక్రియపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఉదయ్‌కుమార్ డిమాండ్ చేశారు. “ఉచిత బియ్యాన్ని పాలిష్ చేయడం లేదని ప్రభుత్వం చెప్తుంటే.. మరి ఈ కొత్త బియ్యం ఎక్కడి నుంచి కొన్నారు? టెండర్ ఎక్కడ వేశారు? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? ఎంత పరిమాణంలో, ఏ ధరకు కొన్నారు? దీనికి ఆహార శాఖ మంత్రి లేదా ముఖ్యమంత్రి వద్ద సమాధానం ఉందా?” అని నిలదీశారు. రాష్ట్రంలో ప్రజలను వేధిస్తున్న సమస్యలపై ముఖ్యమంత్రి విజయ్ స్పందించకుండా మౌనంగా ఉండటం సరికాదన్నారు. పరిపాలనపై అధికారులకు సీఎం ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వడం లేదని విమర్శించారు. తాము అవినీతి రహిత, పారదర్శక పాలన ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మోసపూరిత పాలన అందిస్తున్నారని ఆరోపించారు. రూ.30 బియ్యం కుంభకోణం గురించి సీఎం విజయ్‌కు అసలు విషయాలు తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ఆర్.బి.ఉదయ్‌కుమార్ ప్రశ్నించారు.

