టీవీకే అధినేత, నటుడు విజయ్ తమిళనాడులో ఎన్నికల శంఖారావం పూరించారు. కరూర్ తొక్కిసలాట తర్వాత ఈరోడ్ జిల్లాలో గురువారం భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ అధికార డీఎంకే పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డీఎంకే దుష్టశక్తి అని వ్యాఖ్యానించారు. టీవీకే మాత్రం ప్యూర్ శక్తిగలది అన్నారు. 2026 నాటికి టీవీకేనే క్లీన్ అండ్ ప్యూర్ ఫోర్స్‌గా అభివర్ణించారు. ఈ సందర్భంగా పాలన, నీటిపారుదల, ఉద్యోగాలు, భద్రత, రైతు సంక్షేమంలో వైఫల్యాలను ఎత్తి చూపారు.
పాలనలో డీఎంకే పూర్తిగా విఫలమైందన్నారు. నెరవేరని వాగ్దానాలు, అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. పసుపు సాంప్రదాయకంగా మంచిది అని.. ఈరోడ్ కూడా పసుపు పండించే పవిత్రమైన భూమిగా అభివర్ణించారు. ఈరోడ్‌లోని ప్రజలు చూపించిన విశ్వాసం తనకు అలాంటి బలాన్ని ఇస్తుందని అన్నారు. చాలా మంది కుట్రలను ఉపయోగించి దీన్ని ఎలా నాశనం చేయాలో ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ప్రజలతో తనకున్న సంబంధం కొత్తది కాదని.. తాను సినిమా రంగంలోకి వచ్చి 34 సంవత్సరాలు అయిందని గుర్తుచేశారు.
సామాజిక సంస్కర్త పెరియార్‌ను విజయ్ కొనియాడారు. ‘ఈరోడ్ ఉక్కు మనిషి’గా పిలిచారు. ‘తమిళనాడును మార్చిన వ్యక్తి’ అని అన్నారు. పెరియార్ సైద్ధాంతిక పునాదిని ఇచ్చాడని, అన్నా, ఎంజీఆర్ ఎన్నికల వ్యూహాలను అందించారని తెలిపారు. ‘‘దోపిడీ చేయడానికి పెరియార్ పేరును ఉపయోగించవద్దు.’’ అని పేర్కొన్నారు. అలా చేసేవారు టీవీకే ‘రాజకీయ శత్రువు’. ‘‘సైద్ధాంతిక శత్రువు.’’ అని అన్నారు. 2026లో ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉంటాయని చెప్పారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తొలిసారి టీవీకే పార్టీ ఎన్నికల కథనరంగంలోకి దిగుతోంది. అధికార పార్టీని ఢీకొట్టబోతుంది. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.
