Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ సిల్క్యారా సొరంగం కూలిపోవడంతో గత 15 రోజులగా 41 మంది కార్మికులు అందులోనే చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు దేశంలోని నిపుణులతో సహా అంతర్జాతీయ టన్నెల్ నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇటీవల అమెరికా నుంచి తీసుకువచ్చిన ఆగర్ మిషన్ సాయంతో రెస్క్యూ పనులు త్వరలోనే ముగుస్తాయని, కార్మికులంతా బయటపడతారని అంతా భావించారు. 57 మీటర్ల దూరంలో ఉన్న వారిని రక్షించేందుకు 47 మీటర్ల వరకు స్టీల్ పైపుల్ని అమర్చారు. అయితే మిషన్ విరిగి పోవడంతో ఈ ప్రయత్నాలను విరమించారు.
ప్రస్తుతం కార్మికులను రక్షించేందుకు నిలువుగా డ్రిల్లింగ్ ప్రారంభించారు. మ్యాన్యువల్ డ్రిల్లింగ్ చేసి వారిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభయ్యాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేసేందుకు ఇండియన్ ఆర్మీకి పిలుపు అందింది. ఆర్మీ మాన్యువల్ డ్రిల్లింగ్ ప్రారంభించనుంది. ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ యొక్క ఇంజనీర్ గ్రూప్ అయిన మద్రాస్ సాపర్స్ యొక్క యూనిట్ ఈ రోజు రెస్క్యూ ఆపరేషన్‌లలో సహాయం చేయడానికి సైట్‌కు చేరుకుంది.
Read Also: Jabardasth Naresh: స్టేజిపై ప్రియురాలిని పరిచయం చేసిన పొట్టి నరేష్..
నేషనల్ హైవేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహమూద్ అహ్మద్ మాట్లాడుతూ.. కార్మికులను రక్షించేందుకు మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నాయని తెలిపారు. పెద్దగా అడ్డంకులు లేకుంటే వర్టికల్ డ్రిల్లింగ్ ద్వారా మరో నాలుగు రోజుల్లో సొరంగం వద్దకు చేరుకోవచ్చని తెలిపారు.
360 గంటలకు పైగా 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. వీరికి పైపుల ద్వారా ఆక్సిజన్, ఆహారం, నీరు, మందులు అందుబాటులో ఉన్నాయి, దీంతో వారంత ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ.. ఈ ఆపరేషన్‌కి చాలా సమయం పట్టవచ్చని, పర్వతంపై నుంచి పని చేస్తున్నప్పుడు ప్రతీది అనూహ్యంగా ఉంటుందని, మేము ఎలాంటి టైమ్ ఫ్రేమ్ చెప్పలేమని అన్నారు. అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డ్రిక్స్, కార్మికులు క్రిస్మస్ రోజు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. నవంబర్ 12న సిల్క్యారా సొరంగం కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఉత్తర కాశీ జిల్లాలో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు.