Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు

  • కాశ్మీర్‌లో వందే భారత్ కొత్త రికార్డు
  • ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్‌పై 100 కి.మీ వేగం
Vande Bharat

Vande Bharat

Vande Bharat at 100 kmph: భారతీయ రైల్వే మరో కీలక ఘనత సాధించింది. జమ్మూ కశ్మీర్‌లోని రియాసి ప్రాంతంలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జ్‌పై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దీంతో ఈ రూట్‌లో రైళ్ల గరిష్ఠ వేగాన్ని 75 కి.మీ నుంచి 100 కి.మీకి పెంచిన తర్వాత వందే భారత్ కొత్త స్పీడ్ రికార్డును నమోదు చేసింది. ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే బ్రిడ్జ్‌తో పాటు భారత్‌లో తొలి కేబుల్-స్టే రైల్వే బ్రిడ్జ్ అయిన అంజి బ్రిడ్జ్‌ను కూడా గంటకు 100 కి.మీ వేగంతో దాటింది.

100 కి.మీ వేగానికి పెరిగిన గరిష్ఠ పరిమితి

శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా-బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ రైల్వే సెక్షన్‌లో రైళ్ల గరిష్ఠ వేగ పరిమితిని 75 కి.మీ నుంచి 100 కి.మీకి పెంచారు. ఈ విషయాన్ని నార్తర్న్ రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ అవసరమైన భద్రతా ప్రమాణాలు, పరీక్షలు పూర్తి చేసిన అనంతరం వేగ పరిమితిని పెంచేందుకు అనుమతి ఇచ్చింది. సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఉచిత్ సింఘల్ తెలిపిన వివరాల ప్రకారం, కట్రా-బనిహాల్ సెక్షన్‌లో వేగ పరిమితి పెంచిన తర్వాత వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గంటకు 100 కి.మీ వేగంతో నడిపారు. రైలు చీనాబ్ బ్రిడ్జ్, అంజి బ్రిడ్జ్ రెండింటినీ 100 కి.మీ వేగంతో దాటింది. ఈ రెండు అత్యంత కీలకమైన రైల్వే వంతెనలపై ఈ వేగంతో వందే భారత్ ప్రయాణించడం రైల్వే మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని చూపించే ముఖ్యమైన ఆపరేషనల్ ఘట్టంగా అధికారులు పేర్కొన్నారు.

ప్రయాణికులకు ఏం ప్రయోజనం?

కట్రా-బనిహాల్ సెక్షన్‌లో రైళ్ల వేగం పెరగడంతో ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా రైళ్ల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారడంతో ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మార్పు ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ (USBRL) ప్రాజెక్ట్‌లో కీలకమైన ఆపరేషనల్ ముందడుగుగా భావిస్తున్నారు.

గతంలో ఎంత వేగంతో నడిచేది?

ఇంతకుముందు శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా-సంగల్దాన్ సెక్షన్‌లో రైళ్లకు గరిష్ఠంగా గంటకు 85 కి.మీ వేగం అనుమతించేవారు. అదే సమయంలో సంగల్దాన్- బనిహాల్ సెక్షన్‌లో గరిష్ఠ వేగ పరిమితి గంటకు 75 కి.మీగా ఉండేది. ఇప్పుడు కట్రా-బనిహాల్ మొత్తం 111 కి.మీ సెక్షన్‌లో గరిష్ఠ వేగాన్ని 100 కి.మీకి పెంచారు.

అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో రైల్వే మార్గం

కట్రా-బనిహాల్ రైల్వే మార్గం పీర్ పంజాల్, దిగువ హిమాలయ పర్వత ప్రాంతాల గుండా సాగుతుంది. ఈ ప్రాంతంలో లోతైన లోయలు, నిటారైన కొండచరియలు, పెద్ద నదులు, క్లిష్టమైన భౌగోళిక నిర్మాణాలు ఉన్నాయి. ఈ మార్గాన్ని నిర్మించేందుకు ఆధునిక ఇంజినీరింగ్ సాంకేతికతలను విస్తృతంగా ఉపయోగించారు. ఇందులో పొడవైన సొరంగాలు, భారీ ఎత్తైన వంతెనలు, ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ సెక్షన్‌లో మొత్తం 33 సొరంగాలు ఉండగా, రియాసి సమీపంలోని చెనాబ్ రైల్వే బ్రిడ్జ్, అంజి ఖడ్ రైల్వే బ్రిడ్జ్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.

చీనాబ్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏమిటి?

చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ చీనాబ్ నదిపై నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. పర్వత ప్రాంతంలోని క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ నిర్మించిన ఈ వంతెన USBRL ప్రాజెక్ట్‌లో అత్యంత కీలకమైన నిర్మాణాల్లో ఒకటి. ఇదే మార్గంలో ఉన్న అంజి ఖడ్ బ్రిడ్జ్ భారత్‌లో తొలి కేబుల్-స్టే రైల్వే వంతెనగా ప్రత్యేకతను కలిగి ఉంది.

2025లో వందే భారత్‌ ప్రారంభం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2025 జూన్ 6న శ్రీ మాతా వైష్ణో దేవి కట్రా నుంచి కట్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపారు. తాజాగా కట్రా-బనిహాల్ సెక్షన్‌లో వేగ పరిమితిని 100 కి.మీకి పెంచడంతో USBRL ప్రాజెక్ట్‌లో రైళ్ల వేగం, నిర్వహణ మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో రైల్వే ద్వారా అనుసంధానించే లక్ష్యంలో ఇది మరో కీలక ముందడుగుగా నిలిచింది.