Uttarakhand Tunnel Collapse: ఉత్తర్‌కాశీ సిల్‌క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు మరికొద్ది గంటల్లో బయటకు రానున్నారు. వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయ చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకునేందుకు ఇంకా 2 మీటర్ల దూరమే ఉందని అధికారులు పేర్కొన్నారు. 12 మంది ‘ర్యాట్ హోల్ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) బందంతో డిగ్గింగ్ పనులు చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సహాయ చర్యలపై విపత్తు నిర్వాహణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇస్తూనే ఉన్నారు. సంఘటన స్థలంలోని తాజా పరిస్థితులను మాజీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ హస్నేన్ మీడియాకు వివరించారు.
Also Read: Purandeshwari: రాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది..
ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిగ్గింగ్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, ఇంకా 2 మీటర్ల డిగ్గింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. అది పూర్తయిన తర్వాత ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సొరంగం లోపలికి వెళ్లి కూలీలను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తారని వెల్లడించారు. ఒక్కో కూలీని బయటకు తీసుకొచ్చేందుకు కనీసం 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుందన్నారు. కాబట్టి సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు కనీసం 3 నుంచి 4 గంటలు సమయం పడుతుందన్నారు. లేదా రాత్రంతా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉందన్నారు. కూలీల భద్రత కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా మొదట నేలకు సమాంతరంగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు ఆగిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో అదే చోటు నుంచి ‘ర్యాట్ హోల్ మైనర్లు’ డ్రిల్లింగ్ చేపట్టి మిగతా దూరం పూర్తి చేశారు. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించారు. బయటకు తీసుకువచ్చిన కూలీల కోసం అధికారులు భారీ రక్షణ ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం సొరంగం లోపల తాత్కాలిక వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు సిల్‌క్యారాకు 30 కిలోమీటర్ల దూరంలోని కమ్యూనిటీ హెల్త్‌సెంటర్ వద్ద 41 పడకలతో తాత్కాలిక వార్డ్‌ను సిద్ధం చేశారు. కూలీలను తరలించేందుకు సొరంగం వద్ద అంబులెన్స్‌లను ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లు వెళ్లేందుకు వీలుగా రోడ్లను మెరుగుపర్చారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారిని వాయు మార్గంలో తరలించేందుకు చినూక్ హెలికాప్టర్లను కూడా సొరంగం వద్ద సిద్ధంగా ఉంచారు.