Site icon NTV Telugu

Uttarakhand Girl Assassination Case: యువతి హత్యపై సీఎం సీరియస్.. బీజేపీ నేత కుమారుడి రిసార్ట్ కూల్చివేత

Uttarakhand Girl Murder Case

Uttarakhand Girl Murder Case

Uttarakhand Girl Assassination Case: ఉత్తరాఖండ్‌లో అంకితా బండారీ అనే 19 ఏళ్ల యువతి హత్య ప్రకంపనలు రేపుతోంది. ఈ హత్య వెనక బీజేపీనేత కుమారుడి హస్తం ఉండటంతో రాజకీయంగా ఈ అంశం చర్చనీయాంశం అయింది. యువతి హత్యపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో అన్ని రిసార్టులను విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు అక్రమంగా నిర్వహిస్తున్న రిసార్టులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, బీజేపీ నేత వినోద్ ఆర్య కుమారుడు పుల్కిత్ ఆర్య నిర్వహిస్తున్న రిసార్టులో పనిచేస్తున్న అంకితా బండారీ అనే యువతి ఐదు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. శుక్రవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెను హత్య చేసిననట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పుల్కిత్ ఆర్య. ఈ ఘటనపై సీఎం సీరియస్ అయ్యారు. హత్యలో నేరస్తులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోలీసులు విచారిస్తున్నారని అన్నారు.

Read Also: Living With Dead Body: ఇంట్లో ఏడాదిన్నరగా మృత దేహం..పెన్షన్​ దరఖాస్తులో బయటపడ్డ భాగోతం

ఈ హత్య కేసులో పుల్కిత్ ఆర్యతో పాటు ఇద్దరిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. 19 ఏళ్ల అంకితా బండారీ పుల్కిత్ ఆర్య రిసార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. ఓ వివాదంతో ఆమెను కాలువలోకి తోసేసినట్లు.. ఆమె మునిగిపోయి చనిపోయినట్లు నిందితులు అంగీకరించినట్లు డీజీపీ అశోక్ కుమార్ వెల్లడించారు. రిసార్ట్ యజమాని పుల్కిత్ ఆర్య, రిసార్ట్ మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే రాష్ట్రప్రభుత్వం పుల్కిత్ ఆర్య రిసార్టును కూల్చివేయాలని ఆదేశించింది. బుల్డోజర్లతో పుల్కిత్ ఆర్యకు చెందిన రిసార్టును కూల్చివేస్తున్నారు. అంతకుముందు నిందితులను అరెస్ట్ చేసే సమయంలో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితులు తన కుమార్తెను వేధించారని ఆరోపించారు అంకితా బండారీ తండ్రి.

Exit mobile version