Site icon NTV Telugu

20 ఏళ్లుగా ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హిళ‌ల‌దే రాజ్యం…

ఉత్త‌రాఖండ్ రాష్ట్రంలో ఫిబ్ర‌వ‌రి 14 వ తేదీన ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, 2000 సంవ‌త్స‌రం ముందు వ‌ర‌కు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో క‌లిసి ఉన్న ఉత్త‌రాఖండ్‌ను 2000లో విభ‌జించారు. కాగా, 2002లో తొలిసారి ఉత్త‌రాఖండ్‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. మొద‌టిసారి జ‌రిగిన ఎన్నిక‌ల నుంచి 2017వ వ‌ర‌కు నాలుగుసార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అయితే, ఉత్త‌రాఖండ్‌లోని పౌఢీ గ‌ఢ్వాల్ జిల్లాలోని య‌మ‌కేశ్వ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు మ‌హిళ‌లే విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 90 వేల ఓట్లు ఉండ‌గా సుమారు 40 వేల పైచిలుకు మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు.

Read: జీహెచ్ఎంసీ కీల‌క నిర్ణ‌యం… ఇంటివ‌ద్ద‌కే బూస్ట‌ర్ డోసు…

2002, 2007, 2012 ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి విజ‌య భ‌ర‌ద్వాజ్ అనే మ‌హిళ విజ‌యం సాధించారు. కాగా, 2017 లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ సీఎం బీసీ ఖండూరి కుమార్తె రీతూ ఖండూరి భూష‌న్ బీజేపీ అభ్య‌ర్థిగా పోటీచేసి విజ‌యం సాధించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆరుగురు పురుషులు కూడా పోటీ చేశారు. కాగా, 2022 లో జ‌ర‌గ‌బోతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థిగా రేణు బిస్త్‌ను ప్ర‌క‌టించారు. ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం విస్తరించి ఉంటుంది. ఈసారి కూడా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మ‌హిళ‌కే ప‌ట్టం క‌ట్టే అవ‌కాశాలు ఉన్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version