NTV Telugu Site icon

Tiger attack: పెద్ద పులి దాడి చేసినా బెదరలేదు, ఎలా ప్రాణాలు కాపాడుకున్నాడంటే..

Ankit

Ankit

Tiger attack: పెద్ద పులిని చూస్తేనే సగం ప్రాణాలు పోతాయి. ఇక అది దాడి చేస్తే తప్పించుకోవడం అంత సులభం కాదు. కానీ ఉత్తరాఖండ్‌కి చెందిన 17 ఏళ్ల బాలుడు మాత్రం పెద్దపులితో వీరోచితంగా పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో రామ్‌నగర్ పట్టణానికి చెందిన అంకిత్ పులిదాడికి గురయ్యాడు. ప్రాణాంతక దాడి తర్వాత అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని మళ్లీ సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు.

Read Also: Ukraine War: అణుదాడికి సంకేతాలు ఏమి లేవు.. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా..

నవంబర్ 2023లో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో చెట్టుపై కూర్చున్న పెద్దపులి అంకిత్ వెనక నుంచి దాడి చేసింది. మెడపై దాడి చేసి తలను కొరికింది. దాడి చేస్తున్న సమయంలో పులి తన పట్టు కోల్పోవడంతో అంకిత్ తన కుడి చేతితో పులి నాలుకను గట్టిగా లాగాడు. దీంతో పులి దాడి నుంచి ప్రాణాలు కాపాడుకోగలిగాడు. ఈ దాడిలో అంకిత్ ముఖం, తల, కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి.

దాడి తర్వాత అంకిత్ స్నేహితులు కూడా అతడిని సమీపంలోని వైద్య చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత గురుగ్రామ్ లోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. ఈ దాడి నుంచి అతను ఎలా ప్రాణాలతో బయటపడ్డాడని ఆస్పత్రి వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. అంకిత్ ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సమయంలో తీవ్రంగా రక్తనష్టం జరిగడంతో పాటు అతని పుర్రె ఎముకలు బయటపడ్డాయి, చేతి బొటనవేలు పాక్షికంగా తెగింది, ముఖం, మెడపై తీవ్రగాయాలయ్యాయి. అతడిని సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి పలు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చిందిని మణిపాల్ హాస్పిటల్‌లోని ప్లాస్టిక్ మరియు కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ ఆశిష్ ధింగ్రా తెలిపారు.