ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. 31 ఏళ్ల మహిళ అమీనా 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఇద్దరు మగ శిశువులు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారు. నలుగురు శిశువుల జననంతో కుటుంబంలో ఆనందం వెల్లువిరిసింది. సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చి వైద్య రంగంలో అపూర్వ ఘటన సృష్టించారు. ఈ ఘటనను వైద్యులు “అరుదైన వైద్య అద్భుతం”గా అభివర్ణించారు.
మొదటి బిడ్డ.. మే 9, 2026న ఒక మగ శిశువు (సుమారు 710 గ్రాములు) జన్మించాడు. మిగిలిన ముగ్గురు శిశువులు మే 14, 2026న (అంటే 5 రోజుల తర్వాత) ఒక మగ శిశువు, ఇద్దరు ఆడ శిశువులు జన్మించారు. ప్రసవాలు సాధారణ (నార్మల్ డెలివరీ) ద్వారానే జరిగాయి. సాధారణంగా నలుగురు శిశువులు ఉన్న గర్భం (క్వాడ్రూప్లెట్స్)లో సిజేరియన్ శస్త్రచికిత్సే చేస్తారు, కానీ ఈ సందర్భంలో అన్నీ నార్మల్ డెలివరీలుగా విజయవంతం అయ్యాయి.
నలుగురు శిశువులు వేర్వేరు సంచుల్లో (separate sacs) ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రక్తపోటు, లివర్ వంటి సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ, డాక్టర్ల బృందం నిరంతరం పర్యవేక్షణతో ఈ సవాలును విజయవంతంగా ఎదుర్కొన్నారు. ఈ అపూర్వ ప్రసవాలు మొరాదాబాద్‌లోని టీర్థాంకర్ మహావీర్ యూనివర్సిటీ హాస్పిటల్లో జరిగాయి. హాస్పిటల్ డాక్టర్లు ఈ కేసును “మెడికల్ హిస్టరీ”గా అభివర్ణించారు. బిడ్డలంతా ప్రీమెచ్యూర్‌గా (6.5 నుంచి 7 నెలలు) జన్మించినందున ప్రస్తుతం NICUలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇలాంటి హై-రిస్క్ క్వాడ్రూప్లెట్ గర్భంలో అన్ని నార్మల్ డెలివరీలు చాలా అరుదు. నిరంతర పర్యవేక్షణ, టీమ్ వర్క్‌తో ఈ అద్భుతం సాధ్యమైంది” అని డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
