UP: ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. వ్యసనానికి బానిస అయిన ఓ వ్యక్తిని ‘‘డి అడిక్షన్ సెంటర్’’కు పంపిస్తే.. స్పూన్లు, టూత్ బ్రెష్‌లు తినడానికి బానిసగా మారాడు. కోపంతో ఉన్న అతను ప్రతీ రోజూ స్పూన్లు, టూత్ బ్రెష్‌లను దొంగిలిస్తూ, వాటిని ముక్కలుగా చేసి, నోట్లో నుంచి కడుపులోకి తోసేసే వాడు.
అయితే, కొన్ని రోజుల తర్వాత తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శస్త్ర చికిత్స ద్వారా అతడి కడుపు నుంచి 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రెష్‌లు, రెండు పెన్నులను బయటకు తీశారు. హాపూర్ నివాసి అయిన 35 ఏళ్ల సచిన్‌ను అతడి కుటుంబం ఒక రిహాబిటేషన్ సెంటర్‌కు తరలించింది. అయితే, అక్కడ ఉండే రోగులకు తక్కువ ఆహారం ఇస్తున్నారనే కోపంతో సచిన్ వీటిని తినడం ప్రారంభించాడు.
Read Also: AP Assembly: కామినేని vs బాలయ్య.. జగన్‌తో సినీ ప్రముఖుల మీటింగ్‌పై మాటల యుద్ధం
రోజంతా తమకు తక్కువ చపాతీలు, ఇతర ఆహారం అందించే వారని, ఇంటి నుంచి ఏదైనా వస్తే, తమ చేతికి చేరేది కాదని, కొన్ని సార్లు మాకు ఒక రోజు ఒక బిస్కెట్ మాత్రమే ఇచ్చే వారని సచిన్ చెప్పారు. కోపంతో స్పూన్లు, టూత్ బ్రెష్‌లు దొంగిలించి, వాటిని ముక్కలుగా చేసి, నోటి నుంచి పొట్టలోకి బలవంతంగా పంపిచేవాడు.
కడుపు నొప్పితో ఉన్న అతడికి సీటీ స్కాన్ చేస్తే అతడి కడుపులో స్పూన్లు, ఇతర సామాన్లు చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ముందుగా ఎండో స్కోపి ద్వారా కడుపులో ఉన్న వాటిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అయితే, అది విఫలమైంది. చివరకు అతడికి ఆపరేషన్ చేసి, వాటిని శరీరం నుంచి తొలగించారు.
