నకిలీ ఎన్ కౌంటర్ కేసులు పోలీసు అధికారుల మెడకు చుట్టుకున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ఏళ్ళ క్రితం నాటి ఫేక్ ఎన్ కౌంటర్ కేసు యూపీలో సంచలనం కలిగించింది. ఉత్తర ప్రదేశ్‌లో నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్పీ సహా 18 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2004, నవంబరు3న యూపీలోని షాజహాన్‌పూర్ జిల్లా జలాలాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చాచుపూర్ గ్రామానికి చెందిన ప్రహ్లాద్, ధన్‌పాల్ అనే వ్యక్తులను దోపిడీ కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని కాల్చి చంపి మృతదేహాలను తీసుకెళ్లారు. ఈ ఫేక్ ఎన్ కౌంటర్ పై విమర్శలు వచ్చాయి.
ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రహ్లాద్ సోదరుడు రాంకీర్తి వివిధ కమిషన్లను ఆశ్రయించాడు. చివరాఖరికి ప్రహ్లాద్ సోదరుడు 4 నవంబరు 2012లో చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు. ఎన్‌కౌంటర్ జరిగి 8 ఏళ్ళు అయిపోవడంతో పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు నిరాకరించింది. దీంతో రాంకీర్తి డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు.దీనిపై విచారించిన చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ అభాపాల్ కీలక ఆదేశాలు జారీచేశారు. అప్పటి ఎస్పీ సుశీల్ కుమార్, అదనపు ఎస్పీ మాతా ప్రసాద్ సహా 18 మంది పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో ఈ కేసులో ఏం జరుగుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
