UP CM suspends 15 officials for Lucknow hotel fire incident: లక్నో హోటల్ అగ్నిప్రమాదంపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలు మొదలు పెట్టారు. ఈ ప్రమాదానికి కారణం అయిన అధికారులను సస్పెండ్ చేశారు. పలు శాఖల్లోని 15 మంది అధికారులు సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల క్రితం లక్నోలోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగి నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంపై లక్నో పోలీస్ కమిషనర్ ఎస్బీ షిరాద్కర్, కమిషనర్ రోషన్ జాకబ్ తో కూడిని ఇద్దరు సభ్యుల విచారణ కమిటీ రాష్ట్ర హోంశాఖకు నివేదిక అందించిన ఒక రోజు తర్వాత సీఎం యోగి అధికారులను సస్పెండ్ చేశారు.
హోం, ఎనర్జీ, హౌసింగ్ అండ్ అర్బన్ ప్లానింగ్, లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ (ఎల్‌డిఎ) మరియు ఎక్సైజ్ శాఖలకు చెందిన 15 మంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరో నలుగురు రిటైర్డ్ ఉద్యోగులపై చర్యలకు ఆదేశించారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఈ 15 మంది అధికారులు సస్పెండ్ చేయబడటంతో పాటు శాఖపరమైన విచారణ ఎదుర్కోనున్నారు.
Read Also: Prabhas Emotional: కృష్ణంరాజు మృతితో ప్రభాస్ ఎమోషనల్…
సస్పెండ్ అయిన వారిలో సుశీల్ యాదవ్ (అగ్నిమాపక అధికారి), యోగేంద్ర ప్రసాద్ (ఫైర్ ఆఫీసర్-సెకండ్), హోం శాఖకు చెందిన చీఫ్ ఫైర్ ఆఫీసర్ విజయ్ కుమార్ సింగ్, అసిస్టెంట్ డైరెక్టర్ (ఎలక్ట్రికల్ సేఫ్టీ) విజయ్ కుమార్ రావు, జూనియర్ ఇంజనీర్ ఆశిష్ కుమార్ మిశ్రా, ఇంధన శాఖ సబ్ డివిజనల్ ఆఫీసర్ రాజేష్ కుమార్ మిశ్రా, పిసిఎస్ అధికారి మహేంద్ర కుమార్ మిశ్రా, లక్నో డెవలప్మెంట్ అథారిటీలో అంతకుముందు పనిచేసిన అసిస్టెంట్ ఇంజనీర్ రాకేష్ మోహన్, జూనియర్ ఇంజనీర్ జితేంద్ర నాథ్ దూబే, జూనియర్ ఇంజనీర్ రవీంద్ర కుమార్ శ్రీవాస్తవ, జూనియర్ ఇంజనీర్ జైవీర్ సింగ్, రామ్ ప్రతాప్ తదితరులు ఉన్నారు.
ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించిన దర్యాప్తు ప్యానెల్.. హెటల్ లెవానా సూట్స్ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పనిచేస్తుందని.. పలు శాఖల అధికారులు విధులు సక్రమంగా నిర్వహించలేదని పేర్కొంది. హజ్రత్ గంజ్ లో ఉన్న లెవానా హిల్స్ లో సోమవారం అగ్నిప్రమాదం జరిగి ఇద్దరు మహిళలతో పాటు మొత్తం నలుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే హోటల్ యజమానితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. హోటల్ లో ఫైర్ సేఫ్టీ లోపాలు ఉన్నప్పటికీ.. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్ఓసీ)ని అగ్నిమాపక శాఖ జారీ చేసినట్లు విచారణలో తేలింది.
