ఎప్పుడూ కాపలా ఉండే సెక్యూరిటీ కళ్లు గప్పి ఏకంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలోకి చొరబడ్డాడు ఓ అపరిచిత వ్యక్తి. దక్షిణ కోల్‌కతాలోని మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి చొరబడిన ఘటన శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. అపరిచిత వ్యక్తి ప్రహరీరోడ ఎక్కి లోపలకు ప్రవేశించి, రాత్రంతా ఇంట్లోనే దాక్కున్నాడు. ఆదివారం ఉదయం అతన్ని భద్రతా సిబ్బంది పట్టుకుని స్థానిక కాళీఘాట్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. హైసెక్యూరిటీ జోన్‌లోకి ఏ ఉద్దేశంతో అతను ప్రవేశించాడు, అది కూడా ప్రహరీగోడ ఎక్కి లోపలకు ఎందుకు ప్రవేశించాడనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. జడ్ కేటగిరీ సెక్యూరిటీతో పాటు పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది నిరంతరం అన్ని వైపులా ఆ నివాసానికి భద్రతగా ఉంటారు.
అయితే ఒక వ్యక్తి కాలువ వైపు ఉన్న భవనం పశ్చిమవైపు ప్రహరీ గోడ దూకి లోనికి చొరబడ్డాడు. ఒక మూల నక్కి ఉన్న అతడ్ని భద్రతా సిబ్బంది గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి వద్ద ఎలాంటి ఆయుధం లేదని పోలీసులు తెలిపారు. శనివారం అర్ధ రాత్రి తర్వాత లేదా ఆదివారం ఉదయం ఆ వ్యక్తి ఆకతాయి తనంగా లోనికి చొరబడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ హుటాహుటిన సీఎం మమతా బెనర్జీ నివాసానికి చేరుకున్నారు. అక్కడి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తి చొరబాటు, భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరుగకుండా తగిన చర్యలు చేపడతామని అన్నారు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి అతను ఎలా ప్రవేశించాడు? అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలకు కూడా చిక్కకుండా ఉండటం ఏమిటనే విషయంపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు.
