Udhayanidhi: తమిళ స్టార్ దళపతి విజయ్‌కి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ తన పార్టీ తమిళ్ వెట్రి కజగం(టీవీకే) మొదటి రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించారు. ‘‘విజయ్ చాలా ఏళ్లుగా స్నేహితుడు. నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. నా ప్రొడక్షన్ హౌస్‌లో మొదటి సినిమా అతడిదే. అతను సన్నిహిత స్నేహితుడిగా ఉన్నాడు. విజయ్ రాజకీయాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.
తమిళనాడు విల్లుపురం జిల్లా విక్రవాండిలో ఈ రోజు టీవీకే ద్వారా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. పార్టీని స్థాపించిన 8 నెలల తర్వాత తొలి సమావేశాన్ని నిర్వహించారు. ఇటేవలే ఆయన టీవీకే జెండాను ఆవిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలు, రాష్ట్రానికి సంబంధించి విజయ్ తన రాజకీయ ఎజెండాను ప్రకటించాల్సి ఉంది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: S Jaishankar: 26/11 ముంబై ఉగ్రదాడి సమయంలో భారత్ నుంచి ఎలాంటి స్పందన లేదు..
పార్టీ సిద్ధాంతం గురించి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘‘ఎవరిని రాజకీయాల్లోకి రాకుండా ఆపలేం. ప్రతీ ఒక్కరికి పార్టీ పెట్టే హక్కు ఉంది. చాలా పార్టీలు వచ్చాయి, పోయాయి, కానీ ప్రజల కోసం పనిచేయడం వారి ఆమోదం పొందడం చాలా అవసరం. ఒక పార్టీకి సిద్ధాంత ముఖ్యం. ఆ సిద్ధాంతాన్ని ప్రజలు అంగీకరించడం ముఖ్యం’’ అని అన్నారు. విజయ్ మాత్రమే ఆయన పార్టీ సిద్ధాంతాన్ని నిర్వచించగలడని ఉదయనిధి చెప్పారు.
విజయ్ పార్టీ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగబోతోంది. ద్రవిడ రాజకీయాల్లో డీఎంకే, ఏఐడీఎంకే వంటి బలమైన శక్తుల్ని ఎదుర్కోబోతున్నారు. దీనికి తోడు బీజేపీ కూడా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకుంది. అన్నామలై నేతృత్వంలో బీజేపీ ఈ ఏడాది మంచి పురోగతి సాధించింది. 2026లో సత్తా చాటాలని కాషాయ పార్టీ అనుకుంటోంది. తమిళనాట మంచి స్టార్ డమ్ ఉన్న విజయ్ పార్టీలో తమిళ రాజకీయాల లెక్కలు మారే అవకాశం ఉంది.