TVK Vijay: పొత్తులపై విజయ్ కీలక నిర్ణయం.. ఏ పార్టీలతో వెళ్లబోతున్నారంటే..!

  • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు
  • పొత్తులపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు
  • మే 7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్
  • బుధవారం గవర్నర్‌ను కలవనున్న విజయ్
Tvkvijay

Tvkvijay

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 234 స్థానాలకు గాను 108 స్థానాల్లో టీవీకే విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌‌కు విజయ్ లేఖ రాశారు. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కూడా లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం గవర్నర్‌ చెన్నైలో లేకపోవడంతో కలవలేకపోయారు. బుధవారం రాజ్‌భవన్‌లో విజయ్ కలిసే అవకాశం ఉంది. అంతేకాకుండా మే 7న ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకోసం టీవీకే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.

ఇదిలా ఉంటే తాజాగా విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్లాలని విజయ్ భావిస్తున్నట్లుగా టీవీకే వర్గాలు మీడియాకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని కాంగ్రెస్‌ను ఆహ్వానించారు. ఇక టీవీకే వర్గాల సమాచారం మేరకు.. కాంగ్రెస్, వామపక్షాలు, చిన్న పార్టీలతో కలతిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌తో పాటు వీసీకే, సీపీఐ, సీపీఐ (ఎం), ఐయూఎంఎల్ పార్టీలుతో వెళ్లే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకోగా… IUML, CPI, CPI(M), VCK పార్టీలు తలో 2 సీట్లు సాధించాయి. ఈ పార్టీల మద్దతు లభిస్తే టీవీకే సులభంగా మెజారిటీ మార్క్‌ను దాటే అవకాశం ఉంది.

కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ మాట్లాడుతూ.. ‘‘తమిళనాడు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం.’’ అని తెలిపారు. పార్టీ తుది నిర్ణయం కేంద్ర నాయకత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు.