Site icon NTV Telugu

H-1B visa: ట్రంప్ H-1B వీసా చర్యతో ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం..పెరిగిన అమెరికా విమాన ఛార్జీలు..

H1b Visa

H1b Visa

H-1B visa: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న చర్యతో, ముఖ్యంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. దీనికి తోడు సెప్టెంబర్ 21 వరకు మాత్రమే గడువు విధించడంతో అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం మొదలైంది. ప్రకటన వెలువడిన వెంటనే భారతీయ టెక్కీలు విమానాల నుంచి దిగిపోయినట్లు నివేదికలు వస్తున్నాయి.

ఇదే కాకుండా, ట్రంప్ నిర్ణయాన్ని క్యాష్ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో భారత్ నుంచి అమెరికా వెళ్లే విమాన ఛార్జీలు ఒక్కసారిగా పెరిగాయి. భారత్‌లో చిక్కుకుపోయిన వారు హుటాహుటిన అమెరికా వెళ్లేందుకు విమానాశ్రయాలకు చేరుకుంటున్నారు. దీంతో, అమెరికా వెళ్లే అన్ని విమానాల ధరలు పెరిగాయి. H-1B వీసాలు కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉండటంతో ఈ చర్య వారిని దెబ్బతీసింది.

Read Also: H-1B visa: ఆదివారం నుంచి అమెరికాలోకి ప్రవేశం నిషేధం.. భారతీయులపై H-1B వీసా పిడుగు..

నిబంధనల ప్రకారం, సెప్టెంబర్ 21, భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 9.31 గంటల లోపు అమెరికాలో ఉండాలి. ఆ తర్వాత, వ్యక్తికి స్పాన్సర్ చేసే కంపెనీ లక్ష డాలర్లు అంటే రూ. 88 లక్షలు చెల్లించకుంటే అతడిని అమెరికాలోకి అనుమతించరు. అమెజాన్, మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ వంటి అగ్రశ్రేణి కంపెనీలు H-1B వీసాలు కలిగి ఉన్న తమ ఉద్యోగులకు USను విడిచి వెళ్లవద్దని సూచించాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నవారు వెంటనే అమెరికాకు తిరిగి రావాలని కోరారు.

అయితే, భారత్‌లో సెలవులు, ఇతర పనుల కోసం వచ్చిన H-1B వీసాదారులు ఇప్పటికే గడువును కోల్పోయారు. భారత దేశం నుంచి నేరుగా విమానంలో ఇప్పటికి ఇప్పుడు వెళ్లినా సకాలంలో అమెరికా చేరుకునే అవకాశం లేదు. ట్రంప్ ప్రకటన వెలువడి వెంటనే రెండు గంటల్లోనే న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లే విమాన ఛార్జీలు రూ. 37,000 నుంచి రూ. 80,000 కి పెరిగింది. కనెక్టింగ్ ఫ్లయిట్స్ ద్వారా ఇండియాకు వచ్చే వారు మధ్యలోనే తన విమానాలు దిగిపోయి, మళ్లీ అమెరికా వెళ్లాలని భావిస్తున్నారు. అమెరికా నుంచి భారత్‌కు వద్దామని ప్లాన్ చేసుకున్న వారు, తమ ప్రయాణాలను క్యాన్సల్ చేసుకుంటున్నారు.

Exit mobile version